అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయరాఘవన్, బి వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ రంగంపై శాస్త్రీయ అవగాహనతో పాటు, గ్రామీణ ప్రజల జీవితాలతో మమేకమై పనిచేసిన మంచి కమ్యూనిస్టుగా మల్లారెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తు చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదలు, గ్రామీణ శ్రమజీవుల సమస్యలను కేవలం అధ్యయనం చేయడమే కాకుండా, వాటి పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ఆయన జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతు సంఘం నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో, రైతాంగ సమస్యలను ప్రజా ఉద్యమాల కేంద్రంగా తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిం చారని తెలిపారు. భూమి, సాగునీరు, వ్యవసాయ సంక్షోభం, గ్రామీణా భివృద్ధి, పేదలు–భూమిలేని ప్రజల హక్కులు వంటి అనేక సమస్యలపై ఆయన నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.
సీపీఐ(ఎం)లో వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ నిర్మాణానికి, ప్రజా ఉద్యమాల బలోపేతానికి ఆయన విశేషంగా కృషి చేశారని తెలిపారు. రైతు సంఘంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు బాధ్యతలు నిర్వహించి, రైతాంగ పోరాటాలను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. మల్లారెడ్డి జీవితం కమ్యూనిస్టు సిద్ధాంతంపై నిబద్ధత, రైతాంగం–వ్యవసాయ కార్మి కుల పట్ల అంకితభావం, ప్రజా ఉద్యమాల పట్ల విశ్వాసం కలిగిన జీవితం. ఆయన చూపిన మార్గం, రచనలు, పోరాట అనుభవాలు భవిష్యత్ తరాల కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అఖిల భారత వ్యవసా య కార్మిక సంఘం తరఫున మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, సహచరులకు, రైతు–వ్యవసాయ కార్మిక ఉద్యమ నాయకులు, కార్యకర్త లకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మల్లారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకందించే నిజమైన నివాళిఅని పేర్కొన్నారు.
రైతాంగ ఉద్యమానికి తీవ్ర నష్టం : సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు తీవ్ర నష్టమని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ, సాగునీటి ప్రాజెక్టులపై ఆయనకు విశేషమైన అనుభవం ఉందని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
సారంపల్లి మృతి దిగ్భ్రాంతికరం :
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రైతు సంఘం అఖిల భారత నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతాంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మల్లారెడ్డిని తెలిపారు. రైతు కూలీల, పేదల హక్కుల సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయనకు,ఆయన మృతికి సంతాపం తెలిపారు.
రైతాంగానికి కష్టజీవులకు తీరని లోటు :
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
రైతాంగ సమస్యల పరిష్కారం పట్ల నిరంతరంగా శ్రమించిన యెధుడు మల్లారెడ్డి అని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తెలిపారు. వారి మృతి రైతాంగానికి, కష్టజీవులకు తీరని లోటని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భూ సమస్యల పట్ల ముఖ్యంగా ధరణి కి వ్యతిరేకంగా, భూ భారతి చట్టం అమలు వేగవంతం చేయాలని తదితర అనేక విషయాలలో ఐక్య ఉద్యమాల ఆవశ్యకతను ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ఇచ్చిన సలహాలు, సూచనలు భవిష్యత్తు కార్యాచరణకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సారంపల్లి మల్ల రెడ్డికి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి సతీమణికి సానుభూతిని తెలిపారు.
సారంపల్లి సేవలు చిరస్మరణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
సారంపల్లి మల్లారెడ్డి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతాంగ ఉద్యమ నిర్మాతగా ఆయన సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రైతాంగ ఉద్యమ నిర్మాత, రైతు సంఘం అఖిల భారత నాయకులుగాపనిచేశారని గుర్తు చేశారు. రైతాంగం, పేద రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజా ఉద్యమాల నిర్మాణంలో ఆయన అందించిన సేవలు ఎనలేనివని వివరించారు. నిరంతరం పోరాడిన ప్రజా ఉద్యమ నాయకుడిని కోల్పోవడం రైతాంగ ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని మంత్రి అభిప్రాయపడ్డారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, సహచరులకు, అభిమానులకు, రైతాంగ ఉద్యమ కార్యకర్తలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సామాజిక ఉద్యమాలకు నష్టం : కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం
సారంపల్లి మల్లారెడ్డి మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటు అని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ మేరకు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ రంగంలో తలపండిన మేధావి సారంపల్లి మల్లారెడ్డి అని తెలిపారు. ఆయన మరణం దళితులు, పేదలు, సామాజిక ఉద్యమాలకు తీరని లోటు అని ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అన్ని అంశాలపై పట్టు కలిగిన మల్లారెడ్డి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై సంపూర్ణ అవగాహన ఉందని గుర్తుచేశారు. ఆయన నిస్వార్థం, నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకుడని గుర్తుచేశారు.
కవులు, రైతులు వివిధ సామాజిక అంశాలపై అనేక వ్యాసాలు రాశారని చెప్పారు. కులవక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో సంపూర్ణ సాహిత్య సహకారం అందించారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొనసాగిన సామాజిక అనిచివేతపై ప్రత్యేక కథనాలు రాశారని చెప్పారు. ఆయన ఆశయాల కోసం తుదిశ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నేటి తరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
కార్మిక, కర్షకోద్యమాలకు లోటు : సీఐటీయూ రాష్ట్ర కమిటీ
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మరణం కార్మిక, కర్షకోద్యమానికి తీరని నష్టమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ నివాళుల ర్పించింది. సోమవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాల యంలో మల్లారెడ్డి సంతాప సభను నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలేని నివాళులర్పించిన అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ సారంపల్లి మల్లారెడ్డి 89ఏండ్ల వయస్సు లో కూడా తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించారని గుర్తు చేశారు. సాధారణమైన జీవితాన్ని గడిపి రైతాంగ ఉద్యమానికి వేగు చుక్కగా నిలిచారని కొనియాడారు. ఆయన మరణం ప్రజాతంత్ర, రైతాంగ, కార్మికోద్యమానికి తీవ్రమైన లోటని చెప్పారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మల్లారెడ్డితో అనేక సమస్యల గురించి, ఉద్యమాల గురించి అడిగి తెలుసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ మల్లారెడ్డి రైతాంగం, సాగు, తాగునీరు, ప్రాజెక్టులపై లోతైన అవగాహన కలిగిన మేధావని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీలు, మేధావులందరూ గుర్తించేంతటి నిపుణులని తెలిపారు. ప్రజాతంత్ర ఉద్యమం, ప్రజా సంఘాలలోని నాయకులందరికీ వ్యవ సాయం, సాగు, బడ్జెట్‌పై తగిన సమాచారాన్ని అందించేవారని గుర్తు చేశారు. భౌతికంగా మనందరికీ దూరమైనా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ మల్లారెడ్డి మరణం రైతు ఉద్యమానికి మాత్రమే కాదు, కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నదని చెప్పారు. మల్లారెడ్డి భార్య, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రజా ఉద్యమంలో ఉన్నారన్నారని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షు లు భూపాల్, జె. మల్లిఖార్జున్, ఎస్వీ. రమ, పి. జయలక్ష్మి, వి.ఎస్. రావు, రాష్ట్ర కార్యదర్శులు ఎం. పద్మశ్రీ, పుప్పాల శ్రీకాంత్, పి. సుధాకర్, కె. గోపాలస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, రొయ్యల రాజు తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞానగని సారంపల్లి ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
: సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, ఏఐకేఎస్ అఖిల భారత నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని నష్టమని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు నివాళుల ర్పించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మృతికి అఖిల భారత కమిటీ అరుణాంజిలి ఘటిస్తున్నదని తెలిపారు. సారంపల్లి ఒక విప్లవ విజ్ఞానగని అని పేర్కొన్నారు. ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను విశ్లేషించడం, సులభశైలిలో బోధించడంలో ఆయన దిట్టని తెలిపారు. వ్యవసాయ పరిశోధన, ప్రాజెక్టులు, నదీ జలాల కేటాయింపులు- వివాదాలు, పంటల సాగు తది తర అంశాలపై ఆయనకున్న అవగాహన ఉన్నత స్థాయి శాస్త్ర వేత్తలతో సరిసమానమైనదని కొనియాడారు. ఆ విప్లవ యోధుడికి హృదయపూర్వక శ్రద్ధాంజిలి ఘటిస్తూ, భార్య భాగ్యలక్ష్మి , కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రైతులతో పాటు శ్రామికులకూ నష్టం : టీఎస్ యూటీఎఫ్
ఉద్యమ నేత సారంపల్లి మరణం పట్ల టీఎస్ యూటీఎఫ్ తీవ్ర సంతాపాన్ని తెలిపింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కమిటీ పక్షాన అశ్రనివాళులు అర్పించారు. రైతుల సమస్యలను, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి సాధికారికంగా మాట్లాడగలిగిన మేధావి మల్లారెడ్డి అని చెప్పారు. ప్రజల కోసం, రైతుల కోసం నిరంతరం పాటుపడిన శ్రమజీవి మల్లారెడ్డి మరణం రైతులతోపాటు శ్రామిక ప్రజలందరికీ తీరని లోటు అని వారు పేర్కొన్నారు.
ప్రజా ఉద్యమాలకు తీరని లోటు : ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, రైతాంగ ఉద్యమ నిర్మాత, సాగునీటి రంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. ఈ మేరకు ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. మల్లారెడ్డి అనేక సమస్యలపై చేసిన అధ్యయనం ప్రజా ఉద్యమాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. మల్లారెడ్డితో మాట్లాడితే ఎన్నో కొత్త విషయాలు తెలిసేవని గుర్తుచేశారు. రైతంగా సమస్యలపై, సాగునీటి వనరులపై మల్లారెడ్డి చేసిన అధ్యయనం నేటి తరానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మల్లారెడ్డి ఉపన్యాసం చేస్తుంటే ఎంతటి మేధావి అయినా కొత్త విషయాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. సంక్షేమ రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో పాలకుల కుట్రలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో మల్లారెడ్డి దిట్ట అని పేర్కొన్నారు. మల్లారెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు.
నీతి, నిజాయితీ, నిబద్ధత గల మహానాయకులు : టీడబ్ల్యూజేఎఫ్
నీతి, నిజాయితీ, నిబద్దత గల మహానాయకులు కామ్రేడ్ సారం మల్లారెడ్డి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. వ్యవసాయం, విద్యుత్, బ్యాంకింగ్ సాగునీటి రంగాల్లో మల్లారెడ్డి నిష్ణాతులు. ఆయన దగ్గర ఉండే సమాచారం ప్రభుత్వం దగ్గర కూడా ఉండదు. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఆయన జీవితం ఉద్యమాల మయం. పత్రికలకు నిరంతరం ప్రజలను చైతన్యం చేయాడానికి వ్యవసాయ, రైతు, సాగునీటి, రాజకీయ రంగాలకు సంబంధించి వ్యాసాలు రాసేవారు. ఆయన మరణం ఉద్యమాలకు తీరని లోటు. ఆయనకు నివాళి. వారి కుటుంబానికి సానుభూతి.
మంచి కమ్యూనిస్టు సారంపల్లి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


