సెబ్బాష్‌ రా నాన్న

సెబ్బాష్‌ రా నాన్న! సెబ్బాష్‌!!
ఆడపిల్ల అక్కడే పడుండే పుల్ల కాదనీ
కాపురానికి పిల్లతప్ప కన్నీళ్ళ బిందె కాదనీ
వల్లకాడైనా అత్తింటి కాళ్ళకాడి కట్టెపోగు కాదనీ
చావురేవుల పాతివ్రత్యమే పరమ సత్యం కాదనీ
గతకాలపు సనాతనంపై తిరుగుబాటు కేతనమై
ఎదురేగి కూతురికి స్వాగతం పలికావే
మేళతాళాలతో పుట్టింటి హక్కును చాటావే
అందుకురా నాన్న! అవునన్నా కాదన్నా
నువ్వుప్పుడు సెబ్బాష్‌ నాన్నవయ్యావు

ఇక నుంచి సీత, సావిత్రి కథలే కాదు
కొత్త కథలు .. నాన్న- కూతురు కథలు రాయి
ఆడ పిల్లే కాదు, ఇక్కడకూ పిల్లేనని రాయి
మెట్టినింటి కథలే కాదు, పుట్టింటి కథలూ రాయి
ఆస్తి హక్కే కాదు, ఆత్మరక్షణ హక్కు కథలూ చెక్కు
కూతురే మనిషి జాతికి మళ్ళీ జన్మనే కథ రాయి
లేకుంటే ఆ కథ అక్కడితోనే అంతమనే కథ రాయి

ఇప్పుడేరా అబ్బాయి .. పరువు కథ బరువు దింపి
కూతురి మరోజన్మకు ‘నాన్న’ సాక్ష్యంగా మిగిలావు
అందుకే అంటున్నా! సెబ్బాష్‌ రా నాన్న అని
ఆ పేరు నాన్న- అమ్మాయని నిలప గలిగేలా
అమ్మ ఇంటిపై ఇక నుంచి నాన్న పతాకగా ఎగురు

(జార్ఖండ్‌లోని రాంచిలో తన కూతురు విడాకులు తీసుకున్న సందర్భంగా ఆనందంతో ఊరేగింపు చేసిన తండ్రి)
– ఉన్నం వెంకటేశ్వర్లు, 8790068814

Spread the love