– నివాస గూడును నేలమట్టం చేసిన మున్సిపల్, పోలీసు అధికారులు
– జేసీబీని అడ్డుకున్న బాధిత గుడిసె వాసులు
– సొమ్మసిల్లి పడిపోయిన బాధిత మహిళలు
నవతెలంగాణ-మెదక్
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదల గూళ్ళపై సర్కారు గద్దలు వాలాయి. అండగా నిలిచిన ఎర్ర జెండాను అధికార బలంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. పొద్దంతా కష్టం చేసి చెమటోడ్చినా మూడు పూటలా కడుపు నిండని పేదలపై మున్సిపల్, పోలీసు అధికారులు జులూం ప్రదర్శించారు. అద్దెలు చెల్లించలేని దయనీయ పరిస్థితుల్లో జానెడు పొట్ట చేత పట్టుకొని ప్రభుత్వ స్థలాల్లో అభాగ్యులు వేసుకున్న గుడిసెలను నేలకూల్చారు. అడ్డొచ్చిన బాధితులపై అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదే క్రమంలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మెదక్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల హమాలీ కాలనీ 248/1 సర్వే నంబర్‌లో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంత కాలం నుంచి ఇల్లు లేని నిరుపేదలు 53 మంది గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. 2005లో ఇందిరా గాంధీ హయాంలో పట్టాలను సైతం అందజేసినట్టు బాధితులు తెలిపారు. మెదక్ నగరం నడిబొడ్డునున్న ఈ స్థలంపై కొందరి కన్ను పడిందనే ఆరోపణలు ఉన్నాయి.
రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారనే విషయంలో గతంలో రెండు సార్లు స్థానిక తహసీల్దార్, ఆర్డీవో గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారన్నారు. మరోసారి పలువురు ప్రయివేటు వ్యక్తులు గుడిసెలకు నిప్పు పెట్టారు. అయితే బాధితులు సీపీఐ(ఎం) అండతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. ఆ తరువాత రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. దాదాపు నాలుగైదు నెలల తరువాత నిరుపేదలు కబ్జా చేసింది ప్రభుత్వ స్థలం కాదని, మున్సిపల్ లే అవుట్ పార్క్ స్థలం అంటూ మున్సిపల్ అధికారులు సోమవారం రంగప్రవేశం చేశారు. బాధిత గుడిసెవాసులకు ఎలాంటి సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా అధికార బలంతో పోలీసుల అండదండలతో మున్సిపల్ కమిషనర్ అధ్వర్యంలో పేదల గుడిసెలను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా గుడిసెలను కూల్చేస్తున్న జేసీబీని పలువురు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు పక్కకు తోసేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత మహిళలు ఇండ్ల కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసే క్రమంలో మట్టిలో, బురదలో కిందపడి గాయపడగా, ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అడ్డుకున్న బాధితులపై అధికారులు కర్కశంగా ప్రవర్తించారని, అడ్డొస్తే కేసులు పెడతామని భయ బ్రాంతులకు గురిచేశారని గుడిసెవాసులు తెలిపారు. సంపన్నుల అక్రమాలను అడ్డుకునే చేతగాని అధికారులు కడుపులో పేగులు లేని నిరుపేదల జీవితాలపై దెబ్బ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నాశనం అవుతారని అధికారులకు, ప్రజాప్రతి నిధులకు, ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.
పేదలకు అండగా నిలిచిన ఎర్రజెండా
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే కమ్యూనిస్టు పార్టీ నేతలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు అండగా నిలిచి మద్దతు ఇచ్చారు. మెదక్ పట్టణంలో పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు దుర్మార్గమైన చర్య అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.బస్వరాజ్ తెలిపారు. పది నెలలుగా రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలం అని చెప్పి సర్వేలు చేసిన అధికారులు, ఇప్పుడు మున్సిపల్ పరిధిలోని లే అవుట్ పార్క్‌కు సంబంధించిన స్థలం అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియజేయాలన్నారు. పేదల కడుపు కొట్టి పెద్దలకు పెట్టే విధంగా అధికారుల చర్యలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల గుడిసెల తొలగింపులో కీలక పాత్ర ఎవరిదనే అంశం త్వరలో తెరమీదికి వస్తదని, ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు అండగా ఎర్ర జెండా నిలబడుతుందని స్పష్టం చేశారు.