కూరెళ్ల వల్ల వెల్లంకికి ఖ్యాతి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై

కూరెళ్ల వల్ల వెల్లంకికి ఖ్యాతి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై– గ్రామంలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన గవర్నర్‌
నవతెలంగాణ-రామన్నపేట
కూరెళ్ల విఠలాచార్య కృషితో గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పిన మహా గ్రంథాలయం వల్ల యావత్‌ తెలంగాణలో వెల్లంకి గ్రామానికి మంచి ఖ్యాతి దక్కిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయ నూతన భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కూరెళ్ల విఠలాచార్యులను ఘనంగా సత్కరించారు. కూరెళ్ల కుటుంబ సభ్యులు గవర్నర్‌ని సత్కరించారు. అనంతరం గవర్నర్‌ రూ.10వేల విలువైన రాత పుస్తకాలను, రూ.6 వేల విలువైన గ్రంథాలను అందజేశారు. రూ.10,63,473 ప్రొసీడింగ్‌ను గ్రంథాలయ అభివృద్ధికి అందజేశారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉపయోగపడే అనేక పుస్తకాలను ఈ గ్రంథాలయంలో ఏర్పాటు చేశారన్నారు. అందరూ ఈ గ్రామీణ మహా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానినరేంద్ర మోడీ మన్‌కీబాత్‌ కార్యక్రమంలో విఠలాచార్యను ప్రశంసిస్తూ మాట్లాడటం, దేశంలోని అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కూరెళ్ల విఠలాచార్య అద్భుతమైన కృషి వల్ల రాజ్‌భవన్‌ మీ వెల్లంకి గ్రామానికి వచ్చిందని అన్నారు. పుస్తకాలు మంచి సమాజాన్ని సృష్టిస్తాయని చెప్పారు.
కూరెళ్ల విఠలాచార్యను కలుసుకోవడానికి, మారుమూల గ్రామంలో నెలకొల్పిన ఈ మహా గ్రంథాలయాన్ని సందర్శించడానికి ప్రత్యేకంగా సమయం తీసుకుని వచ్చానని తెలిపారు. గవర్నర్‌ వెంట యాదాద్రి జిల్లా కలెక్టర్‌ హనుమంత్‌ కె.జండగే, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కూరెళ్ల నరసింహాచారి, అధికార ప్రతినిధి నర్మదా, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్‌ రెడ్డి, ఎర్రోళ్ల లక్ష్మమ్మ, మాజీ సర్పంచులు ఎడ్ల మహేందర్‌ రెడ్డి, పున్న నరసింహ, తాళ్లపల్లి సత్తిరెడ్డి, తాటిపాముల స్వామి ఉన్నారు.

Spread the love