కదం తొక్కిన జీపీ కార్మికులు

– కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, భారీ ర్యాలీ
– సమస్యలు పరిష్కరించకుంటే 6 నుంచి సమ్మెకు సిద్ధం
– జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ పాలడుగు సుధాకర్‌, జిల్లా చైర్మెన్‌ రాపర్తి రాజు
నవతెలంగాణ-జనగామ
కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్‌కు కదం తొక్కారు. పంచాయతీ ఉద్యోగ, కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, మల్టీ పర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రీస్టియన్‌ గ్రౌండ్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా జిల్లా కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైటాయించి కార్మికులు ధర్నా నిర్వహించారు. సుమారు 5 గంటలకు పైగా సాగిన ఈ ధర్నాలో.. ఐక్య పోరాటాల ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకుంటామని నినదించారు. ఈ సందర్భంగా పాల్గొన్న సభలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ పాలడుగు సుధాకర్‌, జిల్లా చైర్మెన్‌ రాపర్తి రాజు వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో పంచాయతీ కార్మికుల శ్రమ ఫలితంగానే జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు రాష్ట్రానికి వచ్చాయని, కానీ వారి సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని గ్రామపంచాయతీల్లో 11 నెలల నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, దాంతో వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో సుమారు 50 వేల మందికి పైగా పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారని, ఏండ్ల తరబడి పనిచేస్తున్నా వారిని పర్మినెంట్‌ చేసి కనీస వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా లాంటివి అమలుచేయడం లేదన్నారు. ఇప్పటికైనా వారిని పర్మినెంట్‌ చేసి పీఆర్సీలో నిర్ణయించిన బేసిక్‌ ప్రకారం రూ.19 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో మరణించిన సిబ్బందికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు.. డీపీఓ కలెక్టర్‌ పరిధిలో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని, 8 గంటల పని దినం, వారాంతపు, పండుగ సెలవులు ఇవ్వాలన్నారు. ఏడాదికి 3 జతల యూనిఫామ్‌, సరిపడా చెప్పులు, నూనెలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి 17 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందించామని, జులై 5వతేదీ లోపు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్లు పగిడిపల్లి మల్లేష్‌, నారోజు రామచంద్రం, డి శ్రీశైలం, బత్తిని వెంకన్న, బస్వ రామచంద్రం, జిల్లా నాయకులు ఎస్‌ విజేందర్‌, జె ప్రకాష్‌, రాజేంద్రప్రసాద్‌, గుర్రం లాజర్‌, జీడి ఆనందం, గుగులోతు రతన్‌ సింగ్‌, టి. యాకూబ్‌, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Spread the love