పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని సీతారాంపురంలో శ్రీ లక్ష్మీ భూలక్ష్మీ సహిత నాగశిరల (బోడ్రాయి), పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ మరియు గ్రామ దేవతా సహిత నాగేంద్ర, నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన ఎమ్మెల్యే, భక్తులందరికీ ఆ గ్రామ దేవతల ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా గ్రామ దేవతల ఆలయాల పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపనలు ఎంతో కీలకమని అన్నారు. గ్రామ దేవతలు చల్లని చూపుతో గ్రామాన్ని సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంచుతారని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఐకమత్యంతో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



