అమ్మ‌మ్మ పుస్త‌కాల హోట‌ల్‌

74 ఏండ్ల భీమాబాయి జోందాలే చాలా మందికి ప్రేరణగా నిలిచింది. ఈ వయసులో ఆమె ప్రారంభించిన ఉచిత లైబ్రరీనే దీనికి కారణం. ఆమెను అక్కడి వారంతా ఆజీ అని ప్రేమగా పిలుచుకుంటారు. తన చిన్న టీ స్టాల్‌ను ఆమె ‘అజ్జిచ్య పుస్తకాంచ హోటల్‌’ (అమ్మమ్మ పుస్తకాల హోటల్‌) పేరుతో ఓ పెద్ద లైబ్రేరీనే సృష్టించింది. తన హోటల్‌కి వచ్చే కష్టమర్లు పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తున్న ఆ అమ్మమ్మ కృషి గురించి నేటి మానవిలో…
ఒక చిన్న టీ స్టాల్‌ నడుపుతున్న భీమాబాయి తన దగ్గరకు వచ్చిన కస్టమర్లను నిత్యం గమనించేది. వారు టీ తాగుతూ గంటల కొద్ది తమ ఫోన్లకు అతుక్కుపోవడం చూసింది. దాంతో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే తన టీ స్టాల్‌ల్లో మరింత ఆకర్షణీయమైన వాతావరణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. ఆమెకు చదవడమంటే చాలా ఇష్టం. కానీ ఆ అవకాశం తనకు దొరకలేదు. కనుక తన వద్దకు వచ్చే కష్టమర్లకు చదివే అలవాటును పరిచయం చేయాలనుకుంది. అలా 2015లో అజ్జిచ్య పుస్తకాంచ హోటల్‌ (అమ్మమ్మ పుస్తకాల హోటల్‌) ప్రారంభమైంది.
తినుబండారాలతో పాటు
ముంబై – ఆగ్రా మధ్య జాతీయ రహదారి 3 వెంబడి ఉన్న ఈ టీ స్టాల్లో తినుబండారాలు కూడా ఉంటాయి. ఆ స్టాల్‌ ఆహా రపు సువాసనలతో పాటు అందమైన అనేక పుస్తకాలతో నిండి ఉంటుంది. ఆజీ అని ముద్దుగా పిలవబడే 74 ఏండ్ల భీమా బాయి ప్రారంభించిన ఈ హోటల్‌ తినడానికి మంచి ఆహారం, తాగడానికి చక్కని టీతో పాటు చదవడానికి ఉచిత పుస్తకాలను కూడా అందిస్తుంది. ఇందులో ప్రస్తుతం మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 5,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఒంటరి పోరాటం
నాసిక్‌లోని ఖట్వాడ్‌ గ్రామానికి చెందిన భీమాబాయికి ఆరో తరగతి చదువుతున్నప్పుడే వివాహమైంది. ఆమెకు చదవడం అంటే చాలా ఇష్టం. అయితే పెండ్లి తర్వాత ఆమె దాన్ని కొనసాగించలేకపోయింది. మద్యానికి బానిసైన భర్తతో జీవితం ఆమెకు ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టింది. ‘నాకు బాగా గుర్తుంది, అతను నిద్రలేచి తాగడం మొదలుపెట్టేవాడు. మాకు 20 ఎకరాలకు పైగా భూమి ఉంది. మద్యం కోసం అతను చేసిన ఖర్చుల వల్ల ఇప్పుడు కేవలం 2 ఎకరాలు మాత్రమే మిగిలింది’ అని ఆమె చెబుతోంది. అటువంటి భర్తతో ఆమె ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. కొడుకు ప్రవీణ్‌పై ఉన్న ప్రేమతో కుటుంబాన్ని పోషించే బాధ్యత భుజాలకెత్తుకుంది.
భూమి అమ్మేసి…
తల్లి తనను చూసుకోవడంతో పాటు కుటుంబాన్ని పోషించడం కోసం పొలం పనులు కూడా చేసేదని, ఆమె మల్టీ టాస్కర్‌ అని తల్లి గురించి ప్రవీణ్‌ అంటున్నాడు. అయితే వారి భూమికి సమీపంలో ఫ్యాక్టరీ ప్రారంభించడంతో పరిస్థితి మరింత దిగజారింది. భూమిలో రసాయనాలు చొచ్చుకుపోవడంతో పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది. స్థానిక పంచాయితీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి మద్దతు లభించలేదు. ఇతర ఆదాయ మార్గాలేవీ లేకపోవడంతో భూమిని అమ్మేసి హైవేకి సమీపంలో టీ స్టాల్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అలా ఆమె 2010లో ఒక టీ స్టాల్‌ను ప్రారంభించింది. అది తర్వాత కాలంలో బుక్‌ హోటల్‌గా మారింది. ‘నా బంధువులు చాలా మంది నేను టీ స్టాల్‌ ప్రారంభించినందుకు, అందులో నా కొడుకుతో కలిసి పని చేస్తున్నందుకు ఎన్నో మాటలు అన్నారు. అంతేకాకుండా పుస్తక హోటల్‌ను నడపాలనే నా ఆలోచన చూసి ప్రజలు నవ్వుకున్నారు. కానీ ఇవేవీ నన్ను ముందుకు సాగకుండా ఆపలేదు’ అని భీమాబాయి అంటుంది.
ఐదు వేల పుస్తకాలతో…
తండ్రి బాధ్యతా రాహిత్యంతో ప్రవీణ్‌ చదువును పదో తరగతితో ఆపేయాలనుకున్నాడు. కానీ తల్లి మాత్రం కొడుకు చదువును కొనసాగించమని ప్రోత్సహించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రవీణ్‌ తన చదువు కోసం, కుటుంబ ఆదాయానికి సహకరించడానికి రోజూ ఉద యాన్నే పత్రికలు వేసేవాడు. అలా కష్టపడి జర్నలిజంలో మాస్టర్స్‌ పూర్తి చేసి స్థానిక వార్తా పత్రికలో కొంత కాలం పని చేశాడు. తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి చిన్న పబ్లిషింగ్‌ హౌస్‌ని ప్రారంభించాడు. ఇప్పుడు పబ్లిషింగ్‌ హౌస్‌ని నడపడంతో పాటు, హోటల్లో తల్లికి సహాయం చేస్తాడు. అది మొదట్లో 50 పుస్తకాలతో ప్రారంభించబడింది. కానీ ఇప్పుడు 5,000 కంటే ఎక్కువ పుస్తకాలు అందులో ఉన్నాయి. ప్రారంభంలో వారు మరాఠీ పుస్తకాలను మాత్రమే ఉంచారు. అయితే వాటికి వస్తున్న స్పందన చూసి హిందీ, ఆంగ్ల పుస్తకాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ప్రత్యేక సందర్భాలలో…
ప్రారంభంలో ప్రజలు ఉచితంగా ఆ పుస్తకాలను ఉపయో గించుకునేవారు. తర్వాత కొందరు లైబ్రరీ కోసం విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ‘మా హోటల్‌కి వచ్చి తినేటప్పుడు చదువుకోమని ఒక పుస్తకం వారికి ఇచ్చి చదవడం పట్ల వారిలో ఆసక్తి పెంచాము’ అని ఆమె జతచేస్తుంది. ఆ హోటల్‌ ప్రజలలో చదివే అలవాటును పెంపొందించడానికి మహిళా దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో ఉచిత పుస్తకాలను అందిస్తుంది. అంతే కాకుండా ఆసుపత్రులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడం కూడా ప్రారంభించారు.
ఒక సామాజిక కారణం
‘పుస్తక హోటల్‌ ఒక సామాజిక కారణం. మేము దీన్ని వ్యాపార కోణంలో చూడడం లేదు. మా హోటల్‌ను ప్రతిరోజూ సుమారు 100 మంది సందర్శిస్తారు. వారిలో ఎక్కువ మంది తమ ఆర్డర్‌ల కోసం ఎదురుచూస్తున్నప్పుడు పుస్తకాలు చదువుతారు. నేను కూడా ప్రతి రోజూ ఖాళీ సమయం దొరికినప్పుడు, నిద్రపోయే ముందు కచ్చితంగా కొన్ని పేజీలను చదువుతాను. నేను నా చిన్న తనంలో పెద్దగా చదువుకోలేకపోయాను. కానీ హోటల్‌కి వచ్చి చదివేవాళ్ళను చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది’ అని భీమాబాయి అంటుంది.
– సలీమ

Spread the love