రాజ్యాంగం పాకెట్‌ వెర్షన్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి

రాజ్యాంగం పాకెట్‌ వెర్షన్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి– రాహుల్‌ గాంధీ ఎఫెక్ట్‌
– ఆర్డర్లు పెరిగాయంటున్న పబ్లిషర్లు
– లోక్‌సభ ఎన్నికల ప్రచారాల్లో.. ఈ పుస్తకాన్ని పలుసార్లు ప్రదర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత
లక్నో : ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భారత రాజ్యాంగం మార్పు అనే అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విస్పష్ట మెజారిటీకి మించి ఎక్కువ స్థానాలతో అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. రాజ్యాంగాన్నీ మారు స్తుందని హెచ్చరించింది. ఇదే విషయమై, లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఒక పాకెట్‌ వెర్షన్‌ భారత రాజ్యాంగాన్ని పలు సందర్భాలలో ప్రదర్శించాడు. విలేకరుల సమావేశంలోనూ ఈ పాకెట్‌ వెర్షన్‌ను చూపించాడు. ఇప్పుడు ఆ ‘చిన్నపాటి’ రాజ్యాంగ పుస్తకం ఇప్పుడు ప్రజలంద రిలోనూ ఆసక్తిని పెంచుతున్నది.
సుమారు 20 సెంటీమీటర్ల పొడవు, 9 సెంటీమీటర్ల వెడల్పుతో ఉన్న ఆ భారత రాజ్యాంగ పుస్తకం పాకెట్‌లో పెట్టుకొని సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కాగా, ఈ చిన్నపాటి రాజ్యాంగం పుస్తకాన్ని ఒక కంపెనీకి చెందిన ప్రచురణకర్తలు తొలుత 2009లో ముద్రించారు. ఇలా పాకెట్‌ వెర్షన్‌ను ముద్రించాలన్న ఆలోచన సుప్రీంకోర్టు న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ నుంచి వచ్చిందనీ, దానిని లాయర్లకు సులువుగా వారి కోర్టు పాకెట్‌లలో సరిపోయేలా ముద్రించాలని ఆయన సూచించారని సదరు ప్రచురణ సంస్థకు చెందిన ఒక డైరెక్టర్‌ సుమీత్‌ మాలిక్‌ చెప్పారు. ” మొదటి ఎడిషన్‌ను 2009లో ప్రారంభించాం. ఇప్పటి వరకు ఈ పుస్తకానికి సంబంధించి దాదాపు 16 ఎడిషన్లు ప్రచురించబడ్డాయి. ఏండ్లుగా, అనేక మంది లాయర్లు, జడ్జిలు ఈ కాపీలను కొంటున్నారు. రాంనాథ్‌ కోవింద్‌ భారత రాష్ట్రపతిగా అయిన సందర్భంలో ఆయనకు భారత ప్రధాని మోడీ కూడా ఇదే కాపీని అందించారు” అని సుమీత్‌ మాలిక్‌ అన్నారు. ఈ పుస్తకాన్ని ప్రముఖులు ఒకరికొకరు బహుమతిగా కూడా ఇచ్చుకున్నారని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ ఈ పుస్తకాన్ని ప్రదర్శించిన కారణంగా ప్రజల్లో దీనిపై ఆసక్తి పెరిగిందనీ, ఇప్పుడు ఆర్డర్లు రావటం మొదలయ్యాయని తెలిపారు. ”మొదటి ఎడిషన్‌లో 700 నుంచి 800 కాపీలు అమ్ముడయ్యాయి. చివరిదైన 16వ ఎడిషన్‌కు వచ్చేసరికి, ప్రతి ఎడిషన్‌కూ 5000 నుంచి ఆరువేల కాపీలు విక్రయించాం. అయితే, ఈ సారి చిన్నపాటి రాజ్యాంగ పుస్తకం గురించి ఎక్కువ ప్రచారం జరగటంతో ఈ ఏడాది మరిన్ని కాపీలు అమ్ముడవుతాయన్న ఆశాభావంతో మేమున్నాం” అని మాలిక్‌ తెలిపారు.
గతనెల 10న యూపీ రాజధాని లక్నోలో సమృద్ధ భారత్‌ ఫౌండేషన్‌ సంవిధాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. మోడీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఆ సమయంలో ఒక చిన్నపాటి రాజ్యాంగ పుస్తకాన్ని రాహుల్‌ ప్రదర్శించారు. కాగా, రాహుల్‌ ఆ రాజ్యాంగ పుస్తకాన్ని ప్రదర్శించిన తర్వాత ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ పోర్టల్‌లో తానూ దానిని ఆర్డర్‌ పెట్టినట్టు యూపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఏఐసీసీ సభ్యులు ఆశోక్‌ సింగ్‌ తెలిపారు.

Spread the love