– లైంగికదాడులు, వేధింపులు, వివక్ష ఉదంతాలు
– విద్యార్థుల గొంతు నొక్కేస్తున్నారు
– న్యాయ విద్యార్థులకే రక్షణ లేకుంటే ఎలా? : హైకోర్టు వ్యాఖ్య
అహ్మదాబాద్ : గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జీఎన్ఎల్యూ) ప్రాంగణంలో వేధింపులు, అత్యాచారాలు, స్వలింగసంపర్కం, వివక్ష వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవేవో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు కావు. గుజరాత్ హైకోర్టు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ గత వారం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలోని చేదునిజాలు. ఈ నివేదిక ‘నిజంగా భయానకం’గా ఉన్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దారుణాలకు జీఎన్ఎల్ యూయే బాధ్యత వహించాలని ప్రధాన న్యాయమూర్తి సునీతా అగర్వాల్, న్యాయ మూర్తి అనిరుద్ధ మయీతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. అకృత్యాలపై గళం విప్పకుం డా విద్యార్థుల గొంతుకను వర్సిటీ యాజ మాన్యం అణచివేస్తోందని మండిపడింది.
జీఎన్ఎల్యూలో చదువుతున్న ఓ విద్యార్థినిపై లైంగికదాడి జరిగిందని, మరో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిని సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి హర్షా దేవాని నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. యూనివర్సిటీపై వచ్చిన వార్తలను వర్సిటీకి చెందిన ఆంతరంగిక ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ), రిజిస్ట్రార్ అంతకుముందు తోసి పుచ్చారు. ‘ఇది జాతీయ న్యాయ యూనివర్సిటీ ఎలా అవుతుంది? ఏమీ జరగలేదని, విచారణను నిలిపివేశామని రిజిస్ట్రార్ ఓ అఫిడవిట్ సమర్పించారు. ఇలాంటి వ్యక్తులు పిల్లలను ఎలా రక్షిస్తారు?’ అని ప్రధాన న్యాయ మూర్తి ప్రశ్నించారు. వర్సిటీ ప్రాంగణంలో అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబం ధించి రెండు సంఘటనలు మాత్రమే జరగ లేదని, అనేక ఇతర దారుణాలు కూడా చోటు చేసుకున్నాయని బెంచ్ అభిప్రాయపడింది. విద్యార్థులు చేసిన ఫిర్యాదులను వర్సిటీ అధికారులు బుట్టదాఖలు చేశారని నిజ నిర్ధారణ కమిటీ తేల్చిందని తెలిపింది. పైగా విద్యార్థులు తమ సమస్యలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడాన్ని నేరంగా వారు పరిగణించారు. ఇలాంటి పోస్టుల వల్ల వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించారు. న్యాయాన్ని రక్షించాల్సిన లా విద్యార్థులకే ఇలా జరిగితే ఎలా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.