గుజరాత్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌ మోడల్‌

గుజరాత్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌ మోడల్‌– పదేండ్లలో 11 పేపర్లు లీక్‌
– 201 మంది నిందితులపై కేసులు
– ఎలాంటి చర్యలూ తీసుకోని బీజేపీ సర్కారు
– కాంగ్రెస్‌, నిరుద్యోగుల ఆగ్రహం
న్యూఢిల్లీ : గుజరాత్‌ మోడల్‌ అంటూ ప్రచారం చేసుకోని బీజేపీ సర్కారు కేంద్రంలో కొలువు తీరింది. గుజరాత్‌ సీఎంగా ఉన్న మోడీ.. భారత ప్రధానిగా ఎదిగారు. అయితే, మోడీ స్వంత రాష్ట్రం గుజరాతే సాక్షాత్తూ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లకు కేంద్ర బిందువుగా మారుతున్నది. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగార్థులలో నిరాశ పెరుగుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై వారికి నమ్మకం సన్నగిల్లుతున్నది. గుజరాత్‌లోని కాంగ్రెస్‌ యూనిట్‌.. ప్రభుత్వ సంబంధం లేకుండా రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లు సాధ్యం కాదని ఆరోపించింది. రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించిన వార్తలు రావటంతో ప్రముఖ బీజేపీ నాయకుడు, మోడీకి అత్యంత సన్నిహితుడైన అసిత్‌ వోరా గుజరాత్‌ సెకండరీ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు చైర్మెన్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో వార్తల్లో నిలిచిన ప్రింటింగ్‌ ప్రెస్‌ ఒకప్పుడు మోడీ పుస్తకాన్ని ముద్రించింది.
‘మోడీ కీ గ్యారెంటీ’ పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోలో మోడీ ఇచ్చిన హామీలలో ఒకటి. ”దేశవ్యాప్తంగా రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో దుష్ప్రవర్తనను అరికట్టడానికి మేము ఇప్పటికే కఠినమైన చట్టాన్ని రూపొందించాం. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని కఠినంగా శిక్షించేందుకు ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం” అని వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో.. కేంద్రం పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (అన్యాయమైన మార్గాల నివారణ) బిల్లు, 2024ను ఆమోదించింది. దేశవ్యాప్తంగా యువతతో జరుగుతున్న మోసానికి ఈ చట్టం అద్దం పడుతున్నదని విద్యావేత్తలు, నిపుణులు అంటున్నారు.
పేపర్‌ లీక్‌లతో పరీక్షలను రద్దు చేయటమే కాకుండా.. అసంఖ్యాక అభ్యర్థుల ఆశలు, ఆకాంక్షలు కూడా నీరుగారిపోతున్నా యని వారు చెప్తున్నారు. పేపర్‌ లీకేజీల కారణంగా గత ఐదేండ్లలో 15 రాష్ట్రాల్లో 41 రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు రద్దయ్యాయనీ, ఫలితంగా 1.4 కోట్ల మంది దరఖాస్తుదారులకు భారీ నష్టం వాటిల్లిందని కొన్ని వార్త కథనాల సారాంశం.
ముఖ్యంగా, యూపీ, బీహార్‌ రాష్ట్రాలలో ఈ సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. అయితే, బీజేపీ ‘మోడల్‌’ రాష్ట్రమైన గుజరాత్‌లో పరిస్థితి అంత దారుణంగా ఉన్నది. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌లో జరుగుతున్న మోసాలపై అక్కడి యువత, నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ఫిబ్రవరిలో గుజరాత్‌లోని బీజేపీ సర్కారు.. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలలో పేపర్‌ లీక్‌లను నిరోధిం చటానికి ఒక బిల్లును ఆమోదించింది. పేపర్‌ లీకేజీకి సంబంధించిన ‘వ్యవస్థీకృత నేరానికి’ గరిష్టంగా పదేండ్ల జైలుశిక్ష, కనీసం కోటి రూపాయల జరిమానా విధించేలా చట్టంలో ఉన్నది. గత 11 ఏండ్లలో రాష్ట్రంలో 11 పేపర్‌ లీకేజీ కేసులు నమోదయ్యాయని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి హర్ష్‌ సంఘ్వీ తెలిపారు. ఈ కేసులలో 201 మంది నిందితులపై 11 కేసులు నమోదయ్యాయి.
వీటిలో 10 కేసులలో ఛార్జిషీట్లు దాఖలు కావటం గమనార్హం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా ఇతర విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, గుజరాత్‌లో పేపర్‌ లీక్‌ మూలాలు లోతుగా ఉన్నాయనీ, బీజేపీ పాలనతో సంబంధం ఉన్నదని చెప్తున్నాయి.
ఏమిటీ ఈ స్కామ్‌?
2021లో జీఎస్‌ఎస్‌ఎస్‌బీ 186 హెడ్‌ క్లర్క్‌ సీట్లకు రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. పరీక్ష అదే ఏడాది డిసెంబర్‌ 12న రాష్ట్రంలోని దాదాపు 700 కేంద్రాలలో నిర్వహించారు. ఇందులో 88,000 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. పరీక్షకు ముందే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు ప్రశ్నపత్రాలు లీకయ్యాయని వార్తలు రావటంతో పరీక్షను రద్దు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పేపర్‌ అహ్మదాబాద్‌లోని సూర్య ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి లీక్‌ అయింది. ఈ కేసులో గుజరాత్‌ పోలీసులు 30 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసి 14,000 పేజీల ఛార్జిషీట్‌ను తర్వాతి ఏడాది మార్చిలో దాఖలు చేశారు. పోలీసులు ప్రింటింగ్‌ ప్రెస్‌ సూపర్‌వైజర్‌ కిషోర్‌ ఆచార్యను ప్రధాన నిందితుడిగా అభియోగాలు మోపారు. ఈ కేసులో ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని ముద్రేష్‌ పురోహిత్‌ను కూడా విచారించారు. అయితే అతను డిసెంబర్‌ 2021లో ముందస్తు బెయిల్‌ పొందాడు. కుంభకోణానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త యువత, ఉద్యోగార్థులు, నిరుద్యోగులు ఉద్యమాన్ని నడిపారు. సూర్య ప్రింటింగ్‌ ప్రెస్‌ ‘కోట లాంటి భవనం’ నుంచి పరీక్షా పత్రాలు ఎలా బయటకు వస్తాయని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, ఈ వ్యవహారం ఇంకా కోర్టులో ఉన్నది. గతంలో పేపర్‌ లీక్‌లలో సూర్య ప్రెస్‌ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో, గుజరాత్‌ యూనివర్సిటీ సూర్య ప్రెస్‌ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ ప్రెస్‌ ఐదు యూనివర్సిటీలకు సంబంధించిన పరీక్షా పత్రాలను ముద్రించేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ముద్రేష్‌ పురోహిత్‌కు ఆరెస్సెస్‌, బీజేపీతో సంబంధాలున్నాయని గుజరాత్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది.
గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన 14 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ దోషి ఆరోపించారు. జీపీఎస్సీ చీఫ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష (2013), తలతి రిక్రూట్‌మెంట్‌ పరీక్ష (2015), సురేంద్రనగర్‌ జిల్లాలోని గాంధీనగర్‌, మోడసాలో జిల్లా పంచాయతీ నిర్వహించిన తలతి రిక్రూట్‌మెంట్‌ పరీక్ష (2016), 2018లో నిర్వహించిన టీఏటీ-టీచర్‌ పరీక్ష, మెయిన్‌ సేవక్‌ పరీక్ష, నయాబ్‌ చిట్నీస్‌ పరీక్ష, లోక్‌ రక్షక్‌ దళ్‌, 2019లో జరిపిన నాన్‌-సెక్రటేరియట్‌ క్లర్క్‌, 2020లో జరిపిన ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు (కరోనా కాలం), 2021లో నిర్వహించిన హెడ్‌ క్లర్క్‌, విద్యుత్‌ సహాయక్‌, సబ్‌ ఆడిటర్‌, 2022లో జరిపిన ఫారెస్ట్‌ గార్డ్‌, 2023లో జూనియర్‌ క్లర్క్‌ వంటి నియామక పరీక్షలు ఇందులో ఉన్నాయని వివరించారు.
ఆ రెండు సంస్థల హస్తం
రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో గుజరాత్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(జీఎస్‌ఎస్‌ఎస్‌బీ) (ఇది అన్ని ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌లకు పరీక్షలను నిర్వహించే సంస్థ), అహ్మదాబాద్‌లోని సూర్య ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ (ఇక్కడి నుంచే అనేక పేపర్లు లీక్‌ అయినట్టు ఆరోపణ లున్నాయి) అనే రెండు సంస్థల ప్రధాన హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 2021 నాటి హెడ్‌ క్లర్క్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ కేసు గత దశాబ్దంలో గుజరాత్‌లో జరిగిన అత్యంత అపఖ్యాతి పాలైన రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌. ఇది ప్రభుత్వాన్ని కదిలించింది. రాష్ట్రవ్యాప్త నిరసనల తర్వాత అప్పటి జీఎస్‌ఎస్‌ఎస్‌బీ అధ్యక్షులు, బీజేపీి నాయకుడు అసిత్‌ వోరా రాజీనామా చేయవలసి వచ్చింది.

Spread the love