మూడు గంటలపాటు హమాస్‌ నాకు సర్జరీ చేసింది : బందీ వీడియో వైరల్‌

నవతెలంగాణ  – గాజా : ఇజ్రాయెల్‌- పాలస్తీనాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది క్షతగాత్రులై ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ చేతుల్లో బందీగా ఉన్న ఇజ్రాయెల్‌ మహిళకు చెందిన వీడియోను హమాస్‌ సైనిక విభాగం ఇజ్‌ అద్‌ -దిన్‌ అల్‌ కస్సామ్‌ బ్రిగేడ్స్‌ సోమవారం విడుదల చేసింది. ఈ వీడియోలో ఇజ్రాయెల్‌- ఫ్రెంచ్‌కి చెందిన మియా స్కిమ్‌ (21) అనే యువతి చేతికి బ్యాండెజ్‌ వేసి ఉంది. ‘మేము గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న చిన్న ఇజ్రాయెల్‌ నగరమైన స్డెరోట్‌లో ఉంటాము. అక్టోబర్‌ 7న దాడులు జరిగిన సమయంలో నేను కిబ్బట్జ్‌ రీమ్‌లోని సూపర్‌ నోవా సుక్కోట్‌ మ్యూజిక్‌ ఫస్టివల్‌కి వెళ్లాను. ఆ సమయంలో హమాస్‌ దాడి చేసింది. ఈ దాడిలో మ్యూజిక్‌ ఫెస్టివల్‌కి హాజరైన వారిలో కనీసం 260 మంది మృతి చెందారు. నాతో పాటు మరికొంతమందిని హమాస్‌ బందీల్ని చేసింది. ఈ దాడిలో నా చేతికి తీవ్ర గాయమైంది. మూడు గంటల పాటు నాకు సర్జరీ జరిగింది. వారు నన్ను బాగానే చూసుకుంటున్నారు. మందులు ఇస్తున్నారు. చికిత్స చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ నన్ను వీలైనంత త్వరగా విడిచిపెడితే.. నేను మా కుటుంబ సభ్యుల్ని కలుస్తాను. నేను త్వరగా మా ఇంటికి వెళ్లాలి. త్వరగా నన్ను ఇక్కడి నుండి పంపంచండి’ అని ఆమె వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా, మియా కిడ్నాప్‌కు గురైనట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ కూడా ద్రువీకరించింది. మియాతో పాటు బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు తాము అన్ని విధాలా ప్రయ్నిస్తున్నట్లు ఐడిఎస్‌ తన ఎక్స్‌లో పేర్కొంది.

Spread the love