కదం తొక్కిన కష్టజీవులు

Hard people who trampled on the word– ఉపాధి, భూమి, ఇల్లు, ఆహార భద్రత కోసం డిమాండ్‌
– కార్పొరేట్‌, మతోన్మాద ఆటవిక విధానాలను ఓడించాలి : ఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ రాఘవన్‌, బి. వెంకట్‌
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ మతోన్మాద, పశ్చిమ బెంగాల్‌ మమత బెనర్జీ కార్పొరేట్‌ ఆటవిక విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది కష్టజీవులు కోల్‌కతా వీధుల్లో కదం తొక్కారు. ఉపాధి, భూమి, ఇల్లు, ఆహార భద్రత తదితర డిమాండ్లతో కష్టజీవులు ఎర్రజెండాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు. ‘ఎర్రజెండా పేదలకండా, మతోన్మాద బీజేపీ కుట్రలను అడ్డుకుందాం…’ అంటూ కష్టజీవులు నినదించారు. కోల్‌కతాలో జరిగిన కష్టజీవుల మహా ప్రదర్శన, బహిరంగ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ. విజయ రాఘవన్‌, బి. వెంకట్‌, సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు బికాష్‌ రంజన్‌ భట్టాచార్య మాట్లాడారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పేదలను ప్రదర్శనలకు రానీయకుండా ఆటంకాలు కల్పించిందని, దిగ్బంధాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు గంటల తరబడి ప్రదర్శన, సభల్లో పాల్గొన్నారనీ వారు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తృణమూల్‌ ప్రభుత్వాలను ఓడిస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయనీ, ప్రజాస్వామిక హక్కులు తిరిగి పునరుద్ధరించబడతా యని ఈ సందర్భంగా నేతలు చెప్పారు. ఒకప్పుడు బెంగాల్‌లో ఏది మాట్లాడితే… దేశమంతా అదే మాట్లాడే వారని, అటువంటి ఉన్నత చైతన్యం కలిగిన బెంగాల్‌ రాష్ట్రాన్ని అరాచక ఆటవిక పాలనతో మమతా బెనర్జీ అన్ని విధాల అధోగతి పాలు చేసిందని వారు అన్నారు. మమతా బెనర్జీ అవినీతితో గత రెండేళ్లుగా బెంగాల్‌లో ఉపాధిహామీ నిలిచిపోయిందని అన్నారు.
పేదల ‘ఉపాధి’ జాబ్‌ కార్డులన్నీ కబ్జా చేసిన టీఎంసీ, బీజేపీ నేతలు పందికొక్కుల్లా మింగుతున్నారని విమర్శించారు. ఈ కారణం చూపి రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది కనుక నిధులు ఇవ్వబోమంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదనీ ఆరోపించారు. వామపక్షాలు పోరాడి సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం ఉన్న కాలంలో వ్యవసాయ రంగంలో పేదలకు నిత్యం ఉపాధి దొరికేదని, నేడు అదీ దూరమైందని అన్నారు. అక్టోబర్‌ 11న దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బెంగాల్‌ గ్రామీణ ప్రాంతాన్నంత స్తంభింప చేస్తామనీ హెచ్చరించారు. వామపక్ష ప్రభుత్వాలు గ్రామీణ పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంపిణీ చేశాయనీ, పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాయని తద్వారా గ్రామీణ వ్యవసాయం సస్యశ్యామలంగా సాగిందని తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూస్వాములు, పెత్తందారులు పేదల నుంచి భూమిని దౌర్జన్యంగా లాక్కొని… భూమికి దూరం చేశారని విమర్శించారు. ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నేతలు అమీయా పాత్ర, తోషార్‌ ఘోష్‌, రాష్ట్ర కార్యదర్శి మీరా ఫర్‌ సర్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love