Tuesday, July 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికౌలురైతుల గుర్తింపు కాలగర్భంలో కలిసినట్టేనా?

కౌలురైతుల గుర్తింపు కాలగర్భంలో కలిసినట్టేనా?

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కౌలు రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించినవారికి నిరాశే ఎదురవుతోంది. పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం పూర్తయినప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్న కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం విచారకరం. ఇది వ్యవసాయ రంగాన్ని పరోక్షంగా కార్పొరేట్ వ్యవసాయానికి అప్పగించే విధానమే తప్ప వేరేకాదు. పంటల ఉత్పత్తిలో కౌలు రైతుల పాత్ర అత్యంత కీలకమని నిటిఆయోగ్‌ కూడా పేర్కొంది. భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేకపోయినా, కౌలు రైతుల శ్రమతోనే పంటలు పండుతున్నాయి. అయితే కౌలు పేరుతో భూ యజమానులు, అప్పుల పేరుతో వడ్డీ వ్యాపారులు, పంటల కొనుగోలు పేరుతో మధ్యవర్తులు వారిని వేధిస్తున్నారు. సరైన మార్కెట్ సౌకర్యాలు కల్పిం చకపోవడం, కనీస మద్దతు ధర అందించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలా.. కౌలు రైతులు బహుముఖ దోపిడీకి గురవుతున్నారు.

రాష్ట్రంలో సుమారు డెబ్భయి లక్షల మంది రైతులు ఉంటే, వారిలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది కౌలు రైతులే. అంటే వ్యవసాయ ఉత్పత్తిలో అత్యంత కీలకమైన వర్గం వీరిదే. కేసీఆర్ గత ప్రభుత్వం కౌలు రైతులను గుర్తిస్తామని హామీ ఇచ్చి కూడా ఆచరణలో విఫలమైంది. తెలంగాణ ఏర్పడిన 2014లో ఒక్క కౌలు రైతుకూ గుర్తింపు కార్డు ఇవ్వలేదు. 2015లో జీవో నెం.282 ద్వారా కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించినా, కేవలం 43,500 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేసింది. వారిలో కూడా సుమారు 8 వేల మందికి మాత్రమే రూ.26 కోట్ల పంట రుణాలిచ్చి చేతులు దులుపుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కౌలు రైతుల గుర్తింపుపై ఎలాంటి పురోగతి లేదు. ‘బంగారు తెలంగాణ’, ‘ప్రజా పాలన’అంటూ గొప్పలు చెప్పుకునే పాలకవర్గాలు కౌలు రైతులను గుర్తించ కుండా వ్యవసాయాభివృద్ధి ఎలా సాధ్యమో సమాధా నం చెప్పాలి. సన్న, చిన్న, కౌలు రైతులను ఆదుకోకుం డా రైతుల ఆత్మహత్యలను ఎలా అరికడతాయి?
స్వాతంత్ర్యం అనంతరం కౌలుదారుల హక్కుల పరిరక్షణ కోసం 1950లో రక్షిత కౌలుదారుల చట్టాన్ని తీసుకొచ్చారు.

అయితే భూస్వాముల వ్యతిరేకత, అధికార వ్యవస్థలో వారి ప్రభావం కారణంగా ఆ చట్టం సమర్థంగా అమలు కాలేదు. దీంతో కౌలుదారుల పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ లైసెన్స్డ్‌ కల్టివేటర్స్ యాక్ట్–2011ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు (ఎల్‌ఇసి) జారీ చేసి నాలుగు ప్రధాన ప్రయోజనాలు కల్పించాల్సి ఉంది. అవి-పంట రుణాలు, పంట బీమా, పంట నష్టపరిహారం, సబ్సిడీలు‌, ఇతర రాయితీలు. ఇందుకోసం రెవెన్యూ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి, ఫీల్డ్ విచారణ అనంతరం గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం ప్రతి ఏడాది మే నెలలో, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించాలి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఎక్కడా అమలు కావడం లేదు. భూ యజమాని అనుమతి అవసరం లేదని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పటికీ, రెవెన్యూ అధికారులు భూ యజమానుల అభ్యంతరాలను సాకుగా చూపుతూ దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కౌలు రైతుల విషయంలో నిరాశాజనక వైఖరినే అవలంబిస్తోంది. ఎన్నికల సమ యంలో కౌలు రైతులను గుర్తించి ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడం లేదు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు వర్తించకపోవడం అత్యంత విచారకరం. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరగడం, మరోవైపు కౌలు రేట్లు అధికమవడం, ప్రకృతి వైపరీత్యాలు, ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయడం వంటి కారణాలతో కౌలు రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. పంట పండించినా వచ్చిన ఆదాయం వడ్డీలకే సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.సమాజ శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే కౌలు రైతులు నేడు అష్టకష్టాలు పడుతుంటూ చూస్తూ ఊరుకోవడం సరికాదు. వారంతా ప్రభుత్వ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్‌ స్పందించి వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను అధికారికంగా గుర్తిం‌చాలి. వారికి పంట రుణాలు, బీమా, నష్టపరిహారం, సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం అత్యవసరం. అదే వ్యవసాయ రంగానికి, రైతు కుటుంబాలకు, రాష్ట్రాభివృద్ధికి నిజమైన న్యాయమవుతుంది.

పెద్దారపు రమేష్, 8500313310

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -