15న కేజ్రీవాల్‌ పిటిషన్‌ విచారణ

న్యూఢిల్లీ : తన అరెస్టును సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ఈ నెల 1న ట్రయల్‌ కోర్టు కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఏప్రిల్‌ 15తో ముగియనుంది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిందిగా కేజ్రీవాల్‌ తరపు న్యాయవాదులు ఎఎం సింఘ్వీ, షాదన్‌ ఫర్సాత్‌ ఈ నెల 10 సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
యూపీలో ‘ఇండియా’ వేదికకు మద్దతు :ఆప్‌ ప్రకటన
ఉత్తర ప్రదేశ్‌లో పోటీ చేసే ‘ఇండియా’ వేదిక అభ్యర్థులకు బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా తాము పోటీచేయబోమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, నిరంకుశ పాలనను అంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, ఆప్‌ నాయకుడు సంజరుసింగ్‌ మాట్లాడారు. ఢిల్లీలో ఆపరేషన్‌ కమలంపై పోరాటంలో మద్దతు ఇచ్చినందుకు సమాజ్‌వాదీ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి సాధారణ ఎన్నికలు కాదని, అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడి, అట్టడుగు, అణగారిన వర్గాల హక్కులను కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలని అన్నారు. నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని కాపాడేందుకు ఇండియా వేదిక అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రచారంలో ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు జరిపిన తరువాత తమ పార్టీ పాత్ర, ప్రచారానికి సంబంధించి నిర్ణయిస్తామని చెప్పారు. ఆప్‌ కార్యకర్తలంతా ఎస్‌పీ అభ్యర్థులను గెలిపించేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఆప్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తప్పుడు కేసులు పెట్టి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ను మోడీ ప్రభుత్వం జైలుకు పంపించిందని విమర్శించారు.

Spread the love