చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా– పదివారాల తర్వాత సుప్రీం విచారణ
న్యూఢిల్లీ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం పది వారాలకు వాయిదా వేసింది. 17ఏ అంశంపై ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం నిర్ణయం తరువాత బెయిల్‌ రద్దు పిటిషన్‌ పరిశీలిస్తామని జస్టిస్‌ బేలా త్రివేది అన్నారు. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ను సవాల్‌ చేస్తూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ లతో కూడిన ధర్మాసనం విచారించింది. 17ఎ అంశంపై ముగ్గురు న్యాయమూర్తల ధర్మాసనం ఏర్పాటుపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు మెన్షన్‌ చేయాలని అనుకుంటున్నట్టు ధర్మాసనానికి సీఐడీ తరపు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ తెలిపారు. దీనికి స్పందించిన జస్టిస్‌ బేలా త్రివేది అది మీ ఇష్టం అని పేర్కొన్నారు. వేసవి సెలవుల తరువాత సీజేఐ ముందు మెన్షన్‌ చేయనున్నట్టు సీఐడీ తరపు న్యాయవాది తెలిపారు. అయితే 17ఎ అంశంతో సంబంధం లేకుండానే రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని ధర్మాసనానికి చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలు చేశారని, ట్రయల్‌ కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. 17ఎ కింద అనుమతి తీసుకోలేదన్న కారణంగా చార్జిషీట్‌ ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని చెప్పిందన్నారు. కేసులో మెరిట్స్‌ ఆధారంగానే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని, దానికి 17ఎకి ఎందుకు లింక్‌ పెడుతున్నారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసును పది వారాల పాటు వాయిదా వేసింది.

Spread the love