నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
తుర్కపల్లి మండలంలోని దత్తాయిపల్లి పశువైద్యాధికారి డాక్టర్ గుర్రం రామారావు పదోన్నతిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహాయ సంచాలకులుగా వెళ్ళారు. ఈ క్రమంలో శుక్రవారం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ జానయ్య మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలలో మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తూ.. రైతులకు ఆర్థికంగా సహకారం అందించేందుకు కృషి చేస్తున్న డాక్టర్ల సేవలను కొనియాడారు.
డాక్టర్లు ఎల్లప్పుడు రైతులకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం గుర్రం రామారావును జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ తరపున అధికారులందరూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ సహాయ సంచాలకులు డాక్టర్ రమేష్, మోత్కూరు సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనాథ్, భువనగిరి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ గోపి రెడ్డి, రామన్నపేట సహాయ సంచాలకులు డాక్టర్ ఇందిర, నల్గొండ జిల్లా సహాయ సంచాలకులు డాక్టర్ రామచంద్రారెడ్డి , జిల్లా పశువైద్య సంఘ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ , జనరల్ సెక్రెటరీ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా పశు వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



