భారీగా బంగారం పట్టివేత..

నవతెలంగాణ – నెల్లూరు: హైదరాబాద్‌, నెల్లూరు జిల్లాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తంగా 10.27 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశారు. ఈ నెల 7వ తేదీన నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ ప్లాజా వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో టోల్‌ గేట్‌ వైపు వచ్చిన కారును తనిఖీ చేయగా.. సీటు కింద దాచి తరలిస్తున్న 7.798 కిలోల విదేశీ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. హైదరాబాద్‌లో మరోచోట అక్రమ బంగారం ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే మరో బృందం ఆ ప్రాంతానికి చేరుకొని 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లు, ఒక రిసీవర్‌ను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Spread the love