పశ్చిమ బెంగాల్‌ భారీ వర్షం..12 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వర్షానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. పుర్బా బుర్ద్వాన్‌లో ఐదుగురు, పశ్చిమ్‌ మెదినీపూర్‌లో ఇద్దరు, పురూలియాలో ఇద్దరు ప్రాణలు కోల్పోయినట్లు చెప్పారు. నదియాలో గోడ కూలి ఇద్దరు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెట్టుకూలి ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్షాల కారణంగా మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు.

Spread the love