ఆయన ఇల్లే ఓ విప్లవ కేంద్రం

His house is a center of revolutionవెలిదండ అంటే విప్లవ ఉద్యమాలకు పూదండ.అది నాటికి, నేటికి వామ పక్షాల ఉద్యమాల ఖిల్లా. ఆదండలో దారంలా ఉద్భవించిన విప్లవయోధుడు కామ్రేడ్‌ మేదరమెట్ల సీతారామయ్య. ఆయన జీవితం విప్లవ రాజకీయాలతో పెనవేసుకొని కమ్యూనిస్టు ఉద్యమంలో అలుపెరగని పోరాట యోధుడిగానే కాదు, వ్యక్తిగా తనదైన పాత్రను పోషించిన శక్తి. ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ తాలూకా వెలిదండ గ్రామంలో 1924లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన బాల్యం నుండే పోరాట మార్గాన్ని ఎంచుకు న్నాడు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ప్రజలతో మమేక మవుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడిగా, సీపీఐ(ఎం) హుజూర్‌నగర్‌, కోదాడ ఉమ్మడి తాలూకా కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉద్యమానికి ఓ చుక్కానిలా పనిచేశారు. గ్రామ సర్పంచ్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్యేగానూ పోటీ చేశారు.
తెలంగాణలో ప్రజావ్యతిరేకమైన ఫ్యూడల్‌ వ్యవస్థను కాపాడ టానికి కంకణం కట్టుకున్న నిజాం సైన్యాలను, నెహ్రు సైన్యాలను ఎదిరించిన నాయకుడు. పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూ నిస్టుల నాయకత్వంలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం మహా ఉద్యమంలో పాల్గన్న వేలాదిమంది ఉద్యమకారుల్లో సీతారామయ్య ఒకరు. విప్లవం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించే సాహసం, ప్రజల కోసం పని చేయడం అత్యున్నత కర్తవ్య మనే విశ్వాసం చాలా గొప్పవి. ఆటుపోట్లు ఎన్ని వచ్చినా వెనుతిరగక ప్రజా ఉద్యమాల్లో ప్రజల పక్షాన కొనసాగే చైతన్యం మొదలైన ఉత్తమ లక్ష ణాలు కలిగిన వ్యక్తిగా పోరాట రంగం ఆయన్ను తీర్చిదిద్దింది. ఇదే కామ్రేడ్‌ సీతారామయ్యకు ఉన్న ప్రత్యేకత. 15 ఏండ్ల వయసు నుండే పాటలు పాడడం, నాటికలు వేయడం, రామాయణం, భారతం, భాగవతం చదివేవారు. నాటకాల్లో అనేక పాత్రలు పోషించేవారు. ఈ విధంగా గ్రామాల్లో తన తోటి యువకులను సమీకరించి నాటకాలు, వీధి బాగోతాలు వేస్తూండే వారు. తన 18వ యేటలోనే వెలిదండ గ్రామంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు.
నిజాం సంస్థానంలో కొంత భాగం జాగీర్ధారీ పాలన కింద ఉండేది. మరి కొంత భాగం పటేల్‌, పట్వారీ వ్యవస్థ ద్వారా డైరెక్టుగా నిజాం పాలన కింద ఉండేది. గ్రామాలన్నీ భూస్వామ్య పెత్తందారుల ప్రాబల్యం కిందనే ఉండేది. వెలిదండ గ్రామంలో కూడా నాడు పటేలు, పట్వారీ పాలన కొనసాగుతుండేది. వెలిదండ గ్రామానికి పక్కనే బేతవోలు జమీందారీ గ్రామాలు, మరో పక్క బ్రిటీష్‌ పాలన కింద ఉన్న మునగాల జమీందారీ గ్రామాలు ఉండేవి. జమీందారీ, జాగీర్ధారీ గ్రామాల్లో సాధారణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులతో పాటు వారి సొంత అవసరాల కోసం కూడా నిర్బంధపు పన్నులు ప్రజలు చెల్లించేవారు. పటేల్‌, పట్వారీ, జమీందారీ, జాగీర్ధార్‌లు ప్రజలపై దౌర్జన్యాలు చేసేవారు. ఈ స్థితిలో వెలిదండ గ్రామంలో కూడా పటేలు, పట్వారీలు వెట్టిచాకిరీ, దోపిడీ, దౌర్జన్యాలు సాగుతూ ఉండేవి. ఆ గ్రామంలో రైతుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, ప్రజలకు భూ తగాదాలు పెట్టి కేసుల్లో ఇరికించడం, అప్పులిచ్చి హెచ్చు వడ్డీ రేట్లు గుంజటం,పేదల భూములను తాకట్టు పెట్టుకోవడం, భూమి శిస్తులను అధికంగా విధించడం, జరిమానాలు విధించడం, కట్టకపోతే ఇండ్లను జప్తు చేసేవారు.
ఈ తరుణంలో గ్రామంలో ఆంధ్రమహాసభ కార్యకలాపాలను చాపకింద నీరులా వ్యాపింప చేశారు సీతారామయ్య. గ్రామంలోని పటేల్‌, పట్వారీ ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన ప్రతిఘటించేవాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి వ్యతిరే కంగా పాటలు పాడుతున్నాడని సీతారామయ్యపై పోలీసు లకు రిపోర్టు ఇచ్చారు. గ్రామానికి వచ్చిన పోలీసులు ఆయనతో పాటు కొంతమంది యువకులను అరెస్టు చేసి కోదాడ, సూర్యాపేటకు తరలించి, ఆ తర్వాత హైదరాబాద్‌ జైలులో నిర్బంధించారు. వీరిపై కేసు ఏమిటో తెలియదు, విచారణ జరగలే.. ఆ విధంగా తొమ్మిది నెలలు నిర్బంధిం చారు. సీతారామయ్య రిమాండ్‌లో ఉన్న యువకు లందరికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, రాజకీయాల గురించి చెప్పే వారు. జైలు జీవితాన్ని అనుభవిస్తూనే మార్క్సిజం, రష్యా విప్లవం, సోషలిస్టు రాజ్యాంగం గురించి ఆధ్యయనం చేశారు. ఆయన జైలునుంచి వచ్చేసరి మునగాల పరగణ గ్రామమైన కొక్కిరేణిలో కమ్యూ నిస్టు పార్టీ సెంటర్‌ ఏర్పాటు చేసి నడుపు తున్నారు. పరగణా గ్రామాలు కాబట్టి అక్కడ కమ్యూనిస్టు పార్టీపై నిషేధం లేదు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రమహాసభ కోసం పనిచేశాడు. ఆ తర్వాత గ్రామాల్లో సాగుతున్న అరాచాకా లపై ఉద్యమాలు నిర్మించి ప్రజల కోసం పోరాడాడు.
హుజూర్‌నగర్‌ తాలూకాలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఉద్యమాన్ని నిర్మించడంలో అనేక నిర్భంధాలను అధిగమించి ఉద్యమ పురోగతికి కృషి చేశాడు. కాంగ్రెస్‌ గుండాల ఆగడాలను, హత్యా రాజకీయాలను ఎదుర్కొంటూనే కార్యకర్తలకు రక్షణ కల్పిస్తూ తన ఇల్లునే విప్లవ కేంద్రంగా మార్చాడు. ఈయన చేసే పోరాటంలో కుటుంబం పైకి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకున్నారు. నిర్భందాలను ఎదుర్కొన్నారు. అనేక గ్రామాల్లో ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ప్రభుత్వ, బంచరాయి, పోరం బోకు భూములను పేదలకు పంపిణీ చేశారు. లింగగిరిలో కౌలుదారీ హక్కుల కోసం జరిగిన పోరాటంలో, అగ్రహారంలో జరిగిన భూ పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన త్యాగనిరతి, ధైర్య సాహసం, కార్యదీక్ష, వాగ్దాటి నేటికి ప్రజల మదిలో స్ఫురిస్తూనే ఉంది. మార్క్సిస్టు సిద్ధాంత అధ్యయనం, పోరాట అనుభవం, నిర్మాణ దక్షత కలబోసుకున్న విప్లవవీరుడు సీతా రామయ్య. ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయన 1997 అక్టోబరు 10న అనా రోగ్యంతో చనిపోయారు. నేడు ఆ విప్లవయోధుని 26వ వర్థంతి సందర్భంగా ఆయన ఆశయ సాధనకు పునరంకితమవ్వాలని ఆశిస్తూ… విప్లవజోహార్లు.
ఎం. రాములు
9490098338

Spread the love