ఇరాన్ కీలక నిర్ణయం
లెబనాన్‌పై ఇజ్రాయిల్
దాడుల ఎఫెక్ట్
అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు చర్చల్లో ఎలాంటి పురోగతి ఉండదని వెల్లడి
టెహ్రాన్ : ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక మార్గమమైన హార్ముజ్ జలసంధి మళ్లీ మూత పడింది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు ఆపకపోవడంతో హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించింది. అమెరికా తన బాధ్యతల నుంచి తప్పుకోవడాన్ని నిరసిస్తూ ఇరాన్ ఉమ్మడి సైనిక కమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్ దాడులు, అమెరికా నమ్మకద్రోహానికి ఇది మొదటి అడుగేనని, దాడులు ఆగకపోతే తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు స్విట్జర్లాండ్‌కు తమ దౌత్య బృందాన్ని పంపుతున్నట్టు ప్రకటిస్తూనే అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు చర్చల్లో ఎలాంటి పురోగతి ఉండబోదని టెహ్రాన్ తేల్చి చెప్పింది. సైనిక హెచ్చరికల తర్వాత ఇరాన్ తన దౌత్య వ్యూహాన్ని కూడా మార్చింది. గత శుక్రవారమే జరగాల్సి ఉండి రద్దయిన స్విట్జర్లాం డ్‌లో శాంతి చర్చల కోసం తమ ప్రతినిధి బృందం బయలుదేరినట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ పర్యటన కేవలం అమెరికాను నిలదీయడానికేనని స్పష్టం చేసింది. లెబనాన్‌లో యుద్ధం ఆపడం సహా కీలక హామీలను అమెరికా నెరవేరిస్తేనే తుది ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతాయని తెలిపింది. ఈ అవగాహన ఒప్పందంలో ఏ ఒక్క నిబంధన ఉల్లంఘించినా, మొత్తం శాంతి ప్రక్రియే ప్రమాదంలో పడుతుందని ఇరాన్ హెచ్చరించింది.
లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులపై ఆగ్రహం
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ లెబనాన్‌లో ఇజ్రాయిల్ తరచూ దాడులు జరపడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ కారణంతోనే ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేత కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. వాస్తవానికి అమెరికా- ఇరాన్ ఒప్పందంలో ఇటు ఇజ్రాయిల్ గానీ, అటు హిజ్బుల్లా గానీ భాగస్వాములు కావు. తాము హిజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించే వరకు దక్షిణ లెబనాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ దాడుల వల్ల స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్, ఖతార్ దౌత్యవేత్తల మధ్య జరగాల్సిన ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వచ్చే వారం వాషింగ్టన్‌లో ఇజ్రాయిల్, లెబనాన్ ప్రభుత్వాల మధ్య జరగబోయే అమెరికా మధ్యవర్తిత్వ చర్చలైనా ఈ సంక్షోభానికి తెరదించుతాయో లేదో చూడాలని విశ్లేషకులు చెప్తున్నారు.
హార్ముజ్ మళ్లీ క్లోజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



