రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎదుట
సీఐటీయూ ఆందోళన
మంత్రి వివేక్, రాష్ట్ర మెడికల్ డైరెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-రామచంద్రాపురం
రాష్ట్రంలో ఈఎస్‌ఐ నిధులు ఎక్కడికి పోతున్నాయని, కార్మికులకు మెరుగైన వైద్యం అందడం లేదని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతూ శనివారం ఆస్పత్రి ఆవరణలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈఎస్‌ఐ ఆస్పత్రికి వచ్చిన కార్మిక శాఖ మంత్రి వివేక్, ఈఎస్‌ఐ రాష్ట్ర మెడికల్ డైరెక్టర్ హరిచందనకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాండు రంగారెడ్డి మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అత్యవసరంగా సిటీ స్కాన్, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్, డిజిటల్ ఎక్స్‌రే, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్పెషలిస్ట్ వైద్యులు సూచించిన మందులను ఈఎస్‌ఐ మార్గదర్శకాల ప్రకారం ఇక్కడే మూడు నెలలకు సరిపడా అందించాలని, సూపర్ స్పెషాలిటీ మందులను గతంలో మాదిరిగానే రామచంద్రాపురం ఆస్పత్రి ద్వారానే పంపిణీ చేయాలని కోరారు. ఈఎస్‌ఐ కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఐపీ యూనిట్‌కూ రూ.2,600 నుంచి రూ.3,220 వరకు బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ, రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది ఇన్సూర్డ్ పర్సన్స్, కోటి మంది లబ్దిదారుల కోసం సంవత్సరానికి రూ.520 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 12.5 శాతం నిధులను జోడించి ఈఎస్‌ఐ వైద్య సేవలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉండగా, కేవలం రూ.384 కోట్లే కేటాయిస్తోందని తెలిపారు. దీంతో ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో వైద్య పరికరాలు, మందుల కొరత ఏర్పడిందని ఆరోపించారు. డైరెక్టర్ జనరల్ ఆమోదించిన ధర కాంట్రాక్ట్ ప్రకారం 1300 రకాల మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా, బడ్జెట్ లేదనే పేరుతో 150 నుంచి 200 రకాల మందులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కార్మికులు చెల్లిస్తున్న కోట్లాది రూపాయల నిధులతో నడుస్తున్న ఈఎస్‌ఐ వ్యవస్థలో వైద్య సేవలు క్షీణించడం అత్యంత ఆందోళనకరమని చెప్పారు. ప్రభుత్వం, ఈఎస్‌ఐ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకుని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందుల లభ్యతను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సీనియర్ నాయకులు ఎం.డీ వాజిద్ అలీ, పటాన్‌చెరు ఏరియా కార్యదర్శి నాగేశ్వరరావు, ఈఎస్‌ఐసీ బోర్డు మాజీ సభ్యులు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఈఎస్‌ఐ నిధులు ఎక్కడికి పోతున్నాయి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



