Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగాడ్సే రాజ్యం స్థాపించాలన్నదే బీజేపీ వ్యూహం

గాడ్సే రాజ్యం స్థాపించాలన్నదే బీజేపీ వ్యూహం

- Advertisement -

మీనాక్ష‍ి నామినేషన్‌ తిరస్కరించిన ఆర్‌‌వోను ఉరితీసినా తప్పులేదు
గాంధీ భవన్‌‌లో సత్యాగ్రహ దీక్ష‍లో టీపీసీసీ అధ్యక్ష‍ులు మహేష్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రఘుపతి రాజారాం పేరును బీజేపీ మరిచిపోయిందనీ, బీజేపీ గాడ్సే జపం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశంలో గాడ్సే రాజ్యం స్థాపించాలని బీజేపీ వ్యూహం పన్నుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరుకు నిరసనగా శనివారం హైదరాబాద్‌‌లోని గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ సొంత ఎజెండాను తీసుకొచ్చి జనాలపై రుద్దుతున్నదని అన్నారు. కేంద్రంలో అధికారంలో శాశ్వతంగా ఉండటం కోసం ఎంత దూరమైనా వెళ్తున్నదని విమర్శించారు. బీజేపీ చెప్పిందే రాజ్యాంగం అనేలా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడుతున్నదని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నదని విమర్శించారు. దేశంలో 90 శాతం సంపద బీజేపీ నేతల అనుయాయుల చేతిలో ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ భావాలు గల వ్యక్తులు విశ్వవిద్యాలయాల్లో దూరి విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. గాంధీ కుటుంబం త్యాగ మూర్తుల కుటుంబమని అన్నారు. నెహ్రూ, గాంధీ గురించి బీజేపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. మీనాక్షి నటరాజన్‌ విషయంలో దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పారు. ఆమెపై కేసు లేకుండా నామినేషన్‌‌ను తిరస్కరించిన ఆర్వోను ఉరి తీసిన తప్పులేదన్నారు. జార్ఖండ్‌లో అంబానీ తరపు వ్యక్తికి సరైన పత్రాలు లేకున్నా మరోసారి అవకాశం ఇచ్చా‌రని గుర్తు చేశారు. దేవుడు పేరు, మతం గురించి చెప్పకుండా బీజేపీ నేతలకు గెలిచే దమ్ముందా?అని సవాల్‌ ‌విసిరారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదన్నారు. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. సర్‌ ‌పేరుతో లౌకిక వాదుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని చెప్పారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆల్ ఇండియా చైర్మెన్ సునీల్ పన్వర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరై సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పలువురు డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మెన్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -