ఇంటింటా భగీరథ సర్వే..

– నల్లా కనెక్షన్ల సఖ్య సేకరణ
– ప్రత్యేక యాప్ లో నమోదు
– మండలంలో కొనసాగుతున్న  ప్రక్రియ
– అయింది 15 శాతం…కావాల్సింది 75 శాతం
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తీరు తెన్నులపై ప్రభుత్వం ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టింది.ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా గత ప్రభుత్వ హయాంలో ప్రారబించిన మిషన్ భగీరథ పథకం పనితీరును తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది.వారు తమ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి భగీరథ పథకం, నల్లా కనెక్షన్ వివరాలు సేకరిస్తున్నారు.సోమవారం నుంచి మండలంలో సర్వే ప్రారంబించారు.దీనిపై ఇదివరకే పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు.చిన్న గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పెద్ద గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులతోపాటు అంగన్ వాడి టీచర్లు,ఉపాది పిల్డ్ అసిస్టెంట్లు ఇంటింటా సర్వేలు చేస్తున్నారు.
పూర్తి వివరాలు నమోదు..
తాగునీటి సర్వే కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించారు. పంచాయతీ కార్యదర్శులు ఈ యాప్ లొనే నల్లా కనెక్షన్ వివరాలు నమోదు చేస్తున్నారు.ప్రతి పంచాయతీ కార్యదర్శికి ఐడి, పాస్ వార్డ్ కేటాయించారు. గ్రామంలో ఎన్ని నివాసీత ప్రాంతాలు (హ్యాబిటేషన్లు) ఉన్నాయి ఇందులో ఎన్ని ఇల్లు ఉన్నాయి ఎన్ని ఇళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా కొత్తగా కనెక్షన్లు ఇవ్వాల్సిన ఇండ్లు ఏమైనా ఉన్నాయా.. ఉన్న కనెక్షన్ల ద్వారా ఇంటి అవసరాలకు సరిపడా  నీరు సరఫరా అవుతోందా అనే వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు.ఇంటి ఫొటోతోపాటు,నల్లా కనెక్షన్ ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఒక నల్లా కనెక్షన్ ఉన్న ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివాసిస్తున్నాయి.ఆ కుటుంబాల్లోని సభ్యుల సంఖ్య తదితర వివరాలు నమోదు చేస్తారు.ఎంత సమయం నల్లా వస్తుంది.నీటి సరఫరా పెంచాల్సిన అవసరం తదితర అంశాలను సర్వేలో పరిశీలిస్తున్నారు.
మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ..
తాగునీటి నల్లా కనెక్షన్లకు సంబంధించిన ఎంపీడీఓలు ,ఎంపిఓలు, ఇరిగేషన్ అధికారులు ఈ నెల 3న హైదరాబాద్ లో శిక్షణ పొందారు.వీరు జిల్లాలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు, అంగన్ వాడి టీచర్లకు,ఉపాధిహామీ పిల్డ్ అసిస్టెంట్లకు సర్వేపై శిక్షణ ఇచ్చారు.సోమవారం నుంచి మండలంలో శిక్షణ ప్రారంభమైంది.10 రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు.
గడువులోపు సర్వే అయ్యేనా..
మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల వ్యాప్తంగా సర్వే చేయాల్సిన ఇండ్లు 7,433 ఉండగా బుధవారం నాటికి 1125 ఇండ్లు పూర్తి అయ్యాయి.ఇంకా 6,308 ఇండ్లు సర్వే చేయాల్సి ఉంది.నూతనంగా సర్వేలో చేర్పించిన ఇండ్లు 450 ఉన్నాయి. మండల వ్యాప్తంగా 15 శాతం మాత్రమే పూర్తి అయింది. ఇంకా 75 శాతం కావాల్సి ఉంది. అయితే ఈ నెల 20 లోపు సర్వే పూర్తి కావాల్సి ఉంది. తుది గడువులోపు సర్వే పూర్తి అయ్యేనా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
వివరాలు ఉన్నతాధికారులు అందజేస్తాం: విక్రమ్ కుమార్ మండల ఎంపిఓ 
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో మిషన్ భగీరథ కనెక్షన్లపై ఇంటింటా సర్వే సోమవారం నుంచి ప్రారంభించాం. ప్రతి రోజు 20 నుంచి 25 ఇళ్లలో సర్వే నిర్వహించి యాప్ లో పొందపర్చాలని పంచాయతీ కార్యదర్శులకు అదేశాలిచాం. మిషన్ భగీరథ తీరు తెన్నెలపై ప్రతి అంశాన్ని సర్వేలో సేకరిస్తున్నాం. సేకరించిన వివరాలను గడువులోపు ఉన్నతాధికారులకు అందజేస్తాం.
Spread the love