బాధ్యత లేని భర్తతో ఎలా..?

How about an irresponsible husband..?పెండ్లై పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలను చూసుకోవల్సిన బాధ్యత ఎవరిది. తల్లిదండ్రులది అవుతుంది. కానీ కేవలం తల్లికి మాత్రమే సంబంధించిన విషయంగా చూస్తున్నారు. పెండ్లి తర్వాత విడాకులు తీసుకుంటే ఇక పూర్తిగా తల్లిపైనే ఆ భారం పడుతుంది. భర్త మాత్రం ఎలాంటి బాధ్యతలు లేకుండా హాయిగా తీరుగుతుంటాడు. కనీసం అతన్ని ప్రశ్నించేందుకు కూడా వీలు లేదు. సమాజంతో పాటు కుటుంబ సభ్యులు కూడా పిల్లల బాధ్యత తల్లిదే అంటారు. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌.
ఫాతిమాకు సుమారు 40 ఏండ్లు ఉంటాయి. ఆమె భర్త నజీర్‌ మొదటి నుండి సరిగ్గా పనికి వెళ్ళేవాడు కాదు. మొదట్లో ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు. అప్పుడు సమస్యలు పెద్దగా తెలిసేవి కావు. పిల్లలు పెరిగే కొద్ది సమస్యలు కూడా పెరిగాయి. అత్తామామ తినడానికి ఎలాంటి లోటూ చేసేవారు కాదు. కానీ పిల్లల చదువు, వారి అవసరాలు, అనారోగ్యం వస్తే ఆస్పత్రికి తీసుకు వెళ్ళాలన్నా దేనికీ ఆమె వద్ద పైసా ఉండేది కాదు. అలాంటి అవసరాల కోసం పుట్టింటిపై ఆధారపడేది. రాను రాను పరిస్థితి మారిపోయింది. ఫాతిమా వాళ్ళ నాన్న చనిపోయారు. దాంతో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళ మామయ్య ఉద్యోగం నుండి రిటైర్‌ అయ్యాడు. ఆయనకు వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. ఆయనకు పెండ్లి కావల్సిన ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. దాంతో మామ ‘నాకు వచ్చే డబ్బు మొత్తం మీ ఖర్చులకు వాడితే నా పిల్లల పెండ్లి ఎలా చేస్తాను. మీరు వేరుగా ఉండండి’ అని చిన్న షాప్‌ పెట్టిచ్చాడు.
కానీ నజీర్‌ దాన్ని కూడా సరిగ్గా నడిపించలేకపోయాడు. చివరకు అమ్మేశాడు. దాంతో పరిస్థితి దారుణంగా తయారయింది. ఫాతిమా కంపెనీలో పనికి వెళ్ళేది. ఇలాంటి సమస్యల మధ్య మామకు గుండె ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. ఆయన దాచుకున్న డబ్బు మొత్తం ఆస్పత్రి ఖర్చులకే అయిపోయాయి. ఇలాంటి గడ్డు స్థితిలో నజీర్‌ భార్యా, పిల్లల్ని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. పోలీస్‌ స్టేషన్లో కంప్లెయింట్‌ ఇచ్చారు. అయినా ఫలితం లేదు. అతనికి ఎప్పుడు ఇష్టం వుంటే అప్పుడు వచ్చిపోతుండేవాడు. వచ్చినప్పుడు కూడా భార్య పిల్లల్ని విపరీతంగా కొట్టేవాడు. ఇలా ఐదేండ్లు గడిచిపోయాయి. ఫాతిమా పని చేసే చోట దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండేది. దాంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ‘నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏమిటి’ అని భయం పట్టుకుంది. ఇదే విషయాన్ని అత్తమామలకు చెప్పింది. వాళ్ళూ ఏమీ చేయలేక నజీర్‌ వచ్చినప్పుడు పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టారు. ‘నాకు ఆమె వద్దు. విడాకులు ఇచ్చేస్తాను. పిల్లలతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో తెలిసిన వాళ్ళు చెబితే ఫాతిమా ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
నజీర్‌ను, అతని కుటుంబ సభ్యులను కూడా పిలిపించి మాట్లాడాం. ‘నువ్వు భార్యా పిల్లల్ని వదిలిపెట్టి బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. పైగా పిల్లలతో నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నావు. విడాకులు ఇస్తానంటున్నావు. విడాకులు ఇవ్వడమంటే అంత తేలికనుకుంటున్నావా? ఐదుగురు పిల్లల బాధ్యతను భార్యపై వేశావు. ఫాతిమా ఏమీ చేయలేదని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. దీని వల్ల నువ్వు చాలా నష్టపోతావు. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. సంపాదన లేకపోతే ఎవ్వరూ నీకు విలువ ఇవ్వరు. ఓ మనిషిగా కూడా చూడరు. తాగి తాగి నీ ఆరోగ్యం పాడైతే చూసే దిక్కులేక అల్లాడిపోతావు. అనసరంగా సమస్యలు తెచ్చుకోకు. ఇప్పుడు ఫాతిమాకు అండగా మేమున్నాము. అవసర మైతే పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళతాం. నిన్నేం చేయాలో మాకు బాగా తెలుసు. ఇప్పటికైనా మారి నీ బాధ్యతలు తెలుసుకో. భార్యా పిల్లల్ని చక్కగా చూసుకో. ఏదైనా పని చేసి డబ్బు సంపాదించు. అప్పుడు నీ విలువ ఎంత పెరుగుతుంతో నీకే తెలుస్తుంది’ అని హెచ్చరిస్తున్నట్టు గట్టిగా మాట్లాడాము.
దాంతో అతను కాస్త భయపడ్డాడు. తన తప్పు తెలుసుకుని ‘ఇకపై నేను కూడా పని చేసుకుంటాను. నా భార్యాల్ని చూసుకుంటాను’ అన్నాడు. ‘ఇవన్నీ మాటల్లో కాదు, చేతుల్లో చూపించు అప్పుడు నమ్ముతాం’ అని చెప్పి పంపించాము. ఐదుగురు పిల్లల్లో మేమే మాట్లాడి ముగ్గురిని హాస్టల్లో చేర్పించాం. మేము ఆ బాధ్యత తీసుకునే సరికి తనని ఎక్కడ పోలీస్‌ స్టేషన్లో అప్పగిస్తామో అనే భయంతో ఫైనాన్స్‌లో నజీర్‌ ఆటో తీసుకుని నడిపించడం మొదలుపెట్టాడు. ఫాతిమా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర్లో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంది. పక్కనే ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. అక్కడ చికిత్స తీసుకుంది. ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే వుంది. అదే ఆస్పత్రిలో చిన్న ఉద్యోగంలో చేరింది. వాళ్ళ మధ్య గొడవలు కూడా తగ్గిపోయాయి. మిగిలిన ఇద్దరు పిల్లల్ని కూడా హాస్టల్లో వేయడానికి మాట్లాడుతున్నారు.
ఆర్థిక పరిస్థితి బాగుంటే అన్ని బంధాలు బాగుంటాయని సంపాదించడం మొదలుపెట్టిన నజీర్‌కు తెలిసొచ్చింది. పని చేయకముందు అతన్ని ఎవ్వరూ పలకరించే వారు కాదు. బాధ్యత లేకుండా భార్యా పిల్లలను వదిలేసి తిరుగుతు న్నాడని అందరూ అతన్ని తిట్టేవారు. అలాం టిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపో యింది. ఆటో నడిపిన డబ్బును భార్యకు ఇస్తున్నాడు. పిల్లల్ని కూడా బాగా చూసు కుంటున్నాడు. తాగడం మాత్రం పూర్తిగా తగ్గించలేదు. కానీ ముందులా కాకుండా చాలా వరకు తగ్గించాడు. మరో రెండేండ్లల్లో పూర్తిగా మానేస్తాను అని మాకు మాట ఇచ్చాడు. భర్తలో వచ్చిన మార్పుకు ఫాతిమా చాలా సంతోషంగా ఉంది.

– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love