మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి ఎలా ఉందంటే..?

చిత్రం: మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి; నటీనటులు: నవీన్‌ పొలిశెట్టి, అనుష్క, జయసుధ, మురళీ శర్మ, తులసి, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి, హర్షవర్ధన్, భద్రమ్‌ తదితరులు; సంగీతం: రధన్‌; నేపథ్య సంగీతం: గోపీసుందర్‌; ఛాయాగ్రహణం: నీరవ్‌ షా; రచన, దర్శకత్వం: పి.మహేష్‌బాబు; నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్‌; విడుదల తేదీ: 07-09-2023

వైవిధ్యమైన నాయికా ప్రాధాన్య చిత్రాలు ఎంచుకుంటూ సత్తా చాటుతున్న నటి అనుష్క. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో వరుస విజయాలతో జోరు మీదున్నారు నవీన్‌ పొలిశెట్టి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కొత్త సినిమానే ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’. మహేష్‌బాబు దర్శకత్వంలో వచ్చిన ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ అనుష్క-నవీన్‌ల లవ్‌ ట్రాక్‌లో ఓ ఆసక్తికర అంశం దాగి ఉండటం తోపాటు, టీజర్, ట్రైలర్లు వినోదాత్మకంగా కనిపించడంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. మరి ఈ శెట్టి.. పొలిశెట్టిల కథేంటి? ఇది ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంది?

కథేంటంటే..


అన్విత(అనుష్క శెట్టి) లండన్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ చెఫ్‌. ఆమె వంటకు లండన్‌ వాసులు ఫిదా అయిపోతారు. కెరీర్‌ పరంగా ఎంతో ఎదిగినా.. పెండ్లి చేసుకోవడానికి మాత్రం నిరాకరిస్తుంది. ఆమె తల్లి(జయసుధ)ఎన్ని సంబంధాలు చూసినా రిజెక్ట్‌ చేస్తుంది. పెండ్లి ఆలోచనే లేదని తెగేసి చెబుతుంది. ఆ తరువాత తల్లి మరణించడంతో.. తనకు ఓ తోడు కావాలనుకుంటుంది. అందుకోసం ఓ బిడ్డను కనాలనుకుంటుంది. అది కూడా పెళ్లి చేసుకోకుండా. ఐయూఐ పద్దతిలో తల్లి కావాలని ఓ డాక్టర్‌ని సంప్రదిస్తుంది. స్పెర్మ్‌ డోనర్‌ని తనే వెతుకుతానని చెప్పి… తనకు నచ్చిన లక్షణాలు ఉన్న యువకుడి కోసం సెర్చ్‌ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు స్టాండప్ కమెడియన్ సిద్ధు (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. తనతో క్లోజ్‌గా మూవ్‌ అయిన తర్వాత అసలు విషయం చెబుతుంది. అయితే అప్పటికే అన్వితతో ప్రేమలో పడిన సిద్దు ఆమెను కోర్కెను ఎలా రిస్వివ్ చేసుకున్నాడు?  అన్విత పెండ్లి విషయంలో అన్విత ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ప్రెగ్నెంట్‌ అయిన తర్వాత ఆమె దేశం విడిచి లండన్‌ ఎందుకు వెళ్లింది? చివరకు సిద్ధూ – అన్విత ప్రేమ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే.. ప్రేమ.. పెండ్లి అంటే గిట్టని ఓ అమ్మాయికి.. ఈ రెండు బంధాల్ని బలంగా విశ్వసించే ఓ అబ్బాయికి మధ్య జరిగే ఓ వినూత్నమైన ప్రేమ కథాంశమే ఈ చిత్రం. ఈ కథకు కాస్త బోల్డ్‌ టచ్‌ ఇస్తూనే…దర్శకుడు మహేష్ మంచి వినోదం.. చక్కటి భావోద్వేగాలు మేళవించి ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథగా చూస్తే ఇది చాలా చిన్న లైన్‌ అయినా వినోదం.. భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు కూర్చోబెట్టగలిగేలా చేశాడు. అన్విత ప్రపంచాన్ని.. ఆమె వ్యక్తిత్వాన్ని.. తల్లితో ఉన్న అనుబంధాన్ని పరిచయం చేస్తూ వచ్చే ఆరంభ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. తల్లి అనారోగ్యంతో చావుకు దగ్గరైన తల్లిని  తీసుకొని భారత్‌కు రావడం.. ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే తల్లి దూరమవ్వడం.. ఇలా తొలి 20నిమిషాలు అన్విత పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. తల్లి మరణం తర్వాత ఒంటరి అయిన అన్విత.. తాను కూడా తల్లి కావాలని నిర్ణయించుకోవడంతో అసలు కథ మొదలవుతుంది.

  అప్పటి వరకు కాస్త సీరియస్‌గా సాగిన కథ నవీన్‌ పొలిశెట్టి ఎంట్రీతో ఒక్కసారిగా వినోదాత్మకంగా మారుతుంది. స్టాండప్‌ కమెడియన్‌గా అతని పాత్ర పరిచయ సన్నివేశాలు సరదాగా ఉంటాయి.  అన్విత తన జీవితంలోకి వచ్చాక ఓ కన్ఫ్యూజింగ్‌ డ్రామా మొదలవుతుంది. ఆమె అసలు విషయం దాచి పెట్టి తాను అనుకున్న లక్షణాలు సిద్ధులో ఉన్నాయా లేదా? అని తెలుసుకోవడం ప్రారంభించడం.. మరోవైపు ఆమె తన చుట్టూ తిరగడాన్ని సిద్ధు ప్రేమగా భావించడం.. ముఖ్యంగా హోటల్‌లో అన్విత – సిద్ధుల మధ్య వచ్చే ఇంటర్వ్యూ ఎపిసోడ్, హాస్పిటల్‌లో సిద్ధు హెల్త్‌ చెకప్‌ సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే సిద్ధు కుటుంబ నేపథ్యం.. ఇంట్లో వాళ్లకు తాను తనకంటే వయసులో పెద్ద అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు పరోక్షంగా చెప్పే సన్నివేశాలు సరదాగా ఉంటాయి. విరామానికి ముందు అన్విత సిద్ధు షాక్‌ అవ్వడం.. ద్వితీయార్ధం ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
స్పెర్మ్‌ డొనేషన్‌ కోసమే తనతో క్లోజ్‌గా మూవ్‌ అయిందనే విషయం తెలిశాక హీరో ఏం చేశాడనేది సెకండాఫ్‌. ప్రేమించిన అమ్మాయి కాబట్టి ఆమె అడిగిన సహాయం చేస్తాడనేది అందరికి అర్థమైపోతుంది. కానీ ఈ క్రమంలో జరిగే సన్నివేశాలను హిలేరియస్‌గా రాసుకున్నాడు దర్శకుడు.  ఆస్పత్రిలో డాక్టర్‌కి హీరో మధ్య జరిగే సంభాషనలు కానీ.. హీరోయిన్‌ ఇంటికి పిలిస్తే.. వేరేలా అనుకొని వెళ్లడం..ఈ సీన్లలన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. చివరల్లో మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు. అసలు హీరోయిన్‌  ప్రేమ, పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందనే  కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. ఎమోషనల్‌గానూ కనెక్ట్‌ అవుతారు. అయితే కథంతా ఒక పాయింట్‌ చుట్టే తిరగడంతో సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే సినిమా మరింత మంచి ఫలితాన్ని ఇచ్చేది.

నటన విషయానికి వస్తే:
అనుష్క, నవీన్‌ పోలిశెట్టి పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. చెఫ్‌ అన్విత పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. తన స్టార్‌డమ్‌ని పక్కకిపెట్టి.. ఆ పాత్రలో ఎంతమేరకు నటించాలో అంతమేరకు చక్కగా నటించింది. తెరపై చాలా హుందాగా కనిపించింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించింది. ఇక నవీన్‌ పోలిశెట్టి మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. స్టాండప్‌ కమెడియన్‌ సిద్దూ పాత్రలో జీవించేశాడు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. హీరోయిన్‌ తల్లిగా జయసుధ తన పాత్ర పరిధిమేర నటించారు. సినిమా ప్రారంభమైన 10 నిమిషాలకే ఆమె పాత్ర ముగుస్తుంది. ఇందులో ఆమె బాలయ్య వీరాభిమానిగా కనిపించడం గమనార్హం. హీరో తల్లిదండ్రులుగా తులసి, మురళీ శర్మలు రొటీన్‌గానే ఉన్నాయి.
ఇక సాంకేతిక విషయాలకొస్తే..
గోపీ సుందర్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌. రధన్ పాటలు బాగున్నాయి. కథలో భాగంగానే పాటలు వస్తాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ నాట్ బ్యాడ్. ఫస్టాఫ్‌తో పాటు సెకండాఫ్‌లోనూ కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ ఎడిటర్ కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుండేది.

       బలాలు

  •  కథా నేపథ్యం..
  •  నవీన్, అనుష్క నటన
  •  వినోదం.. భావోద్వేగాలు
    బలహీనతలు
  •  ఆరంభ సన్నివేశాలు
  •  నెమ్మదిగా సాగే కథనం

చివరిగా: శెట్టి – పొలిశెట్టి.. నవ్విస్తూ మదిని బరువెక్కిస్తారు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి చివరిగా: దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Spread the love