ఎలా నవ్వను కామ్రేడ్‌…

గుండె నిండా
విశ్వ దుఖాన్ని మోస్తున్నాను
ఎలా నవ్వను కామ్రేడ్‌…
గ్లోబ్‌ నిండా విభజన రేఖలే
విద్వేషంతో సంతోష రేఖ కొట్టుకు పోయింది
సరిహద్దుల గుండా శవాల బట్వాడా
శాంతిపావురం రెక్కలు రక్తంతో
మతాల వక్షాల కింద
మానవత్వపు మొక్కలు వికసించడం లేదు
ముఖంలో వెన్నెల ఎలా మొలుస్తుంది
బతుకు లన్నీ ఆర్థిక మాంద్యం
చీకటిలో చిక్కుకున్నాయి
నేనొక్కడినే అభివద్దిని ఎలా ఆస్వాదించను
అక్షరాల వాదాలు గీసుకుని
దూరాలు సంపుటాలు సంపుటాలుగా
ఒక వంతెన కట్టే కవులు కరువు
క్రిమినల్స్‌ స్వీట్లు పంచు కుంటుంటే
రచయితలు బెయిలు కోసం బోనులెక్కుతున్నారు
పెదవులు కదలక రస్టు పట్టి పోయాయి
గ్రీన్‌ రూమ్‌లో కట్టేసి
ముఖమంతా రంగులు పూసి
నవ్వ మని బలవంత పెడితే
ఎలా నవ్వను కామ్రేడ్‌…!?
(ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా)
– దాసరి మోహన్‌, 9985309080

Spread the love