ఆర్థికాన్ని గాడిలో ఎలా పెట్టాలి?

Revanth Reddy– ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భేటీ 
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అప్పుల కుప్పగా మారిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని ఎలా గట్టెక్కించాలో చెప్పండంటూ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి రిజర్వుబ్యాంక్‌ (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌ను కోరారు. ఆర్థిక క్రమశిక్షణ, నూతన సంస్కరణల అమలు, ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే అంశాలను వివరించాలనీ అడిగారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు రఘురామరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థికరంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏఏ పథకాల కింద ఎలాంటి నిధులు వస్తాయి…వాటి వినియోగం…ఆడిట్‌ వంటి కీలకమైన విషయాలను,,ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను వారితో పంచుకున్నారు. పన్నుల సరళీకరణ, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వంటి పలు అంశాలను ఆయన వారికి వివరించినట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు అయ్యే ఖర్చు, వాటికి కేంద్రం నుంచి ఏవైనా మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ వంటివి వస్తాయా… లేదా… వస్తే వాటిని ఎలా వినియోగించాలి వంటి పలు అంశాలను ఈ సందర్భంగా మంత్రులు రఘురామరాజన్‌ను అడిగి తెలుసుకున్నారు.

Spread the love