కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి

కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి– ప్రభుత్వానికి ఆయన సూచనలు అవసరం : సీఎం రేవంత్‌రెడ్డి
–  ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించిన ముఖ్యమంత్రి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత కే చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి పరామర్శించారు. మాజీ మంత్రి కే తారకరామారావును అడిగి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్‌ భార్య శోభకు ధైర్యం చెప్పారు. ఈనెల 7వ తేదీ రాత్రి చంద్రశేఖరరావు బాత్‌రూంలో కాలుజారి పడినప్పుడు తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. ఆయన్ని కుటుంబసభ్యులు సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి సహచర మంత్రి అనసూయ సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో కలిసి యశోదా ఆస్పత్రికి వెళ్లి మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. రేవంత్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లినప్పుడు మాజీ మంత్రి కేటీఆర్‌ ఎదురెళ్లి, సీఎం కేసీఆర్‌ ఉన్న వార్డుకు తీసుకొచ్చారు. అక్కడే వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. బెడ్‌పై ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి పరామర్శించే సమయంలో సంఘటన జరిగిన తీరును కేసీఆర్‌ రేవంత్‌రెడ్డికి వివరించారు. త్వరగా కోలుకోవాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పడంతో మాజీ మంత్రులు టీ హరీశ్‌రావు, కేటీఆర్‌తో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తన నియోజకవర్గ కార్యకర్త ఒకరు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ, ఆయన్ని పరామర్శించేందుకు వచ్చి, అలాగే మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా పలకరించాలని వచ్చినట్టు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఆస్పత్రి ఆవరణలోనే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ త్వరగా కోలుకొని, అసెంబ్లీకి వచ్చి, ప్రజాసమస్యలపై మాట్లాడాలని ఆకాంక్షించారు. వైద్యులతో మాట్లాడినప్పుడు ఆయన త్వరగా కోలుకుంటున్నారని చెప్పారనీ, ఆయన ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించామన్నారు. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనల అవసరం ఉందని అన్నారు.
ఎమ్సీహెచ్చార్డీ సందర్శించిన సీఎం
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌సీహెచ్చార్డీ)ని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సందర్శించారు. ఆదివారంనాడాయన రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి డి అనసూయ సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో కలిసి అక్కడికి వెళ్లి, సంస్థ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ సీఎంకు ఆహ్వానం పలికారు. అక్కడి ఫ్యాకల్టీతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణపై చర్చించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరేందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేలా శిక్షణలో మార్పులు చేయాలని సూచించారు. అనంతరం అక్కడి సోలార్‌ పవర్‌ వాహనంలో వివిధ బ్లాకుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాల గురించి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. సంస్థ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ బెన్హర్‌ మహేష్‌దత్‌, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జీ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love