ఇక ప్రక్షాళనే…

ఇక ప్రక్షాళనే...– పారదర్శకంగా టీఎస్‌పీఎస్సీ నియామకాల ప్రక్రియ
– యూపీఎస్సీ సహా ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదికివ్వాలి : అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
– సుప్రీం ఆదేశాలకనుగుణంగా చైర్మెన్‌, సభ్యుల నియామకం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎఎస్సీ)ను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి, సీఎం కార్యదర్శి వి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, అడిషనల్‌ డీజీ సీవీ ఆనంద్‌, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి టికె శ్రీదేవి, సిట్‌ స్పెషల్‌ అధికారి శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతోసహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపించాలని చెప్పారు. అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌, సభ్యుల నియామకాలకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు మార్గదర్శకాలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను కోరారు.
నేడు టీఎస్‌పీఎస్సీ సభ్యుల రాజీనామా
టీఎస్‌పీఎస్సీ పాలకమండలి సభ్యులు బి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్‌ తనోబా, కారం రవీందర్‌రెడ్డి బుధవారం రాజీనామా చేయనున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు. బుధవారం హైదరాబాద్‌కు వస్తారు. ఆమె వచ్చిన తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి టీఎస్‌పీఎస్సీ సభ్యులు రాజీనామా పత్రాలను సమర్పిస్తారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సచివాలయంలో వారు కలిశారు. రాజీనామా చేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్‌ అధికారులకు వారు సమాచారమిచ్చారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ బి జనార్ధన్‌రెడ్డి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తప్పు చేయకున్నా తప్పుకుంటున్నా… : ఆర్‌ సత్యనారాయణ
టీఎస్‌పీఎస్సీ సభ్యుడు ఆర్‌ సత్యనారాయణ రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం లేఖ విడుదల చేశారు. తాను ఏ తప్పు చేయలేదు.. అయినా తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ బాధ్యతలు నిర్వర్తించే వాతావరణం లేదని పేర్కొన్నారు. ‘కొత్త కమిషన్‌ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలన్న ఉద్యోగార్థుల ఆకాంక్షలను గౌరవిస్తున్నాను. ఇప్పుడే కాదు. తన విద్యార్థి జీవిత కాలం నుంచి కూడా తాను నిరుద్యోగుల పక్షమే. ఇక ముందు కూడా నిరుద్యోగుల పక్షమే. మీ అందరి ఆశలు, ఆకాంక్షలు వీలైనంత త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. ప్రశ్నాపత్రం లీకేజీ వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎంత మానసిక ఆందోళనకు గురయ్యారో అర్థం చేసుకోగలను.
మేము కూడా తీవ్ర మానసిక క్షోభను అనుభవించాం. ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాం. తీవ్ర అనారోగ్యాలకు గురయ్యాం. నేను ఎల్లప్పుడూ మీ పక్షమే. ఎక్కడ ఉన్నా ఉద్యోగార్థులకు మేలు జరగాలనే కోరుకుంటాను. మీ పక్షాన నిలిచి చేదోడు వాదోడు అవుతాను. మీకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’అని సత్యనారాయణ లేఖలో పేర్కొన్నారు.
జనార్ధన్‌రెడ్డి రాజీనామాను ఆమోదించని గవర్నర్‌
టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించలేదు. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులెవరో తేలకుండా, నిరుద్యోగులకు న్యాయం జరగకుండానే ఆయన రాజీనామాను ఎలా ఆమోదించాలని ఆమె ప్రశ్నించినట్టు తెలిసింది. రాజీనామాపై సీఎస్‌కు లేఖ రాసి కొత్త ప్రభుత్వ అభిప్రాయాన్ని, న్యాయనిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. లీకేజీలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది. లీకేజీ సమయంలోనే టీఎస్‌పీఎస్సీ పాలకమండలికి రద్దు చేయాలంటూ రాష్ట్రపతికి గవర్నర్‌ లేఖ రాసినట్టు సమాచారం.
దాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీవోపీటీ)కి రాష్ట్రపతి భవన్‌ సిఫారసు చేసినట్టు తెలిసింది. నాటి రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని కోరుతూ లేఖ రాశారు. అయితే ఆ ప్రభుత్వం స్పందించలేదని సమాచారం. కోర్టు కేసులు, గతంలో తాను చేసిన సూచన పెండింగ్‌లో ఉండగానే జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయడంతో గవర్నర్‌ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బుధవారం పుదుచ్చేరి నుంచి తమిళిసై సౌందరరాజన్‌ హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆ తర్వాతే టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా మూసీ  – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
మూసీ నది ప్రారంభ ప్రాంతం నుంచి చివరి వరకు ఆ నది పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి, ఆర్థికాభివద్ధి ప్రాంతంగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, దామోదర రాజనర్సింహ, శాసన సభ్యులు అక్బరుద్దీన్‌ ఒవైసీతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, మూసీ పరీవాహక ప్రాంతం పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. నది వెంట బ్రిడ్జిలు, కమర్షియల్‌, షాపింగ్‌ కాంప్లెక్సులు, అమ్యూజ్‌ మెంట్‌ పార్కులు, హాకర్‌ జోన్‌ లు, పాత్‌-వేలను ప్రభుత్వ, ప్రయివేటు పార్ట్నర్‌ షిప్‌ విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

Spread the love