పాఠ్యపుస్తకాలు, టీచర్లు లేకుండా పాఠాలు ఎలా చదవాలి?

– విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
– ప్రయివేట్‌లో అడ్డగోలు ఫీజుల వసూళ్లపై స్పందనేదీ.. : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్‌.ఎల్‌. మూర్తి, టి.నాగరాజు
– విద్యారంగ సమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో, ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.ఎల్‌ మూర్తి,టి.నాగరాజు అన్నారు. ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల తీవ్ర తోపులాట జరిగింది.
హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, జిల్లా కార్యదర్శి కె.అశోక్‌ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు మమత, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు  లెనిన్‌ గువేరా, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, ఇతర నాయకులను అరెస్టు చేసి ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌ వద్ద ఆర్‌.ఎల్‌ మూర్తితోపాటు మేడ్చల్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాథోడ్‌ సంతోష్‌, బి.వెంకటేష్‌, నాయకులను అరెస్టు చేసి శామీర్‌పేట పీఎస్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.ఎల్‌ మూర్తి, టి.నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్‌, పాఠ్యపుస్తకాలు అందిస్తామని ప్రకటించినా ఇప్పటికీ రాలేదన్నారు. ఇంటర్‌ కళాశాలలు, కేజీబీవీలు, గురుకులాలకు ఒక్క పుస్తకమూ పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు లేకుండా పేద పిల్లలు ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. 24వేల టీచర్‌ పోస్టులు, 12వేల లెక్చరర్‌ పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్లకు ఫీజుల రెగ్యూలేషన్‌ ఉందని, పాఠశాల, ఇంటర్‌ కళాశాలల ఫీజులు నియంత్రణ లేదన్నారు. ఫీజు నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రూ.5,177 కోట్ల ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయని, ఐదేండ్ల (2019-2023) ఫీజులు విడుదల చేయకుండా పేద విద్యార్థులను చదువుకు దూరం చేశారన్నారు. బీసీ వసతి గృహాలకు ఆన్‌లైన్‌ పద్ధతిలో ప్రవేశాలు జరపడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించకుంటే చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ఇంటర్నేషనల్‌ పాఠశాలలు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పేర్లతో లక్షల వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రాథోడ్‌ సంతోష్‌, అధ్యక్షుడు బి.వెంకటేష్‌ మాట్లా డుతూ.. కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కెఎస్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన తీశారు. కలెక్టరేట్‌ వద్ద విద్యార్థులను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. కలెక్టర్‌ బయటకు రావాలని, విద్యార్థులకు సమాధానం చెప్పాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎంతకూ రాకపోవడంతో గేట్లు దూకి లోపలికి వెళ్లారు. లోపల బైటాయించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం అదనపు కలెక్టర్‌ పాటిల్‌హేమంత్‌ కేశవ్‌కు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేశారు. జోగులంబ గద్వాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్‌, మంచిర్యాల కలెక్టరేట్లను ముట్టడించారు.

Spread the love