ఇంటర్‌ ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలి : టిప్స్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియట్‌ విద్యలో ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్‌) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టిప్స్‌ కన్వీనర్‌ మాచర్ల రామకృష్ణగౌడ్‌, సమన్వయకర్త మైలారం జంగయ్య, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌, నాయకులు శోభన్‌ బాబు, మంజునాయక్‌, బీక్యా నాయక్‌, వస్కుల శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ రెడ్డి, మనోహర్‌, సంగీత బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల (జూనియర్‌ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, లైబ్రరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది)కి గత ఐదేండ్లుగా సాధారణ బదిలీలు లేకపోవడం వల్ల తీవ్ర మానసిక, ఆర్థిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతం విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీస్‌లను క్రమబద్దీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తక్షణమే సీఎం కేసీఆర్‌ ఇంటర్మీడియట్‌ విద్యలో సాధారణ బదిలీలు జరిపేందుకు ఆదేశాలివ్వాలని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న కొంత మానసిక ఆందోళనను తొలిగించి ప్రశాంతత కలిగించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love