పలువురికి ఐడీసీ అవార్డులు అందజేసిన సీఎం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గోల్కొండ కోటలో జరిగిన స్వతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా పలువురు స్వతంత్ర దినోత్సవ ప్రత్యేక అవార్డుల(ఐడీసీ-2023)ను అందుకున్నారు. వారిలో ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చివారు, విపత్తు సమాయాల్లో ప్రాణాలకు తెగించి ప్రజలను రక్షించిన వారు ఉన్నారు. మొత్తం 14 మందికి అవార్డులను సీఎం అందజేశారు.
1.ములుగు జిల్లాకు చెందిన పాయం వీనయ్య (ఎస్జీటి, గిరిజన సంక్షేమం)
– ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండారు గ్రామంలో వరదల్లో చిక్కుకున్న పాఠశాల విద్యార్థులను రక్షించారు.
2. జనగాం జిల్లాకు చెందిన ఎమ్‌డీ. రహమాన్‌ (లైన్‌మెన్‌, విద్యుత్‌ శాఖ)
– అకాల వర్షాల సమయంలో విద్యుత్‌ పునరుద్ధరణలో విశేష సేవలు అందించారు.
3. ములుగు జిల్లాకు చెందిన సంజీవ్‌ రావు (గ్రామపంచాయతీ కార్యదర్శి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ)
– జిల్లాలోని ముత్యాలధార జలపాతంలో చిక్కుకున్న 80 మంది యాత్రికులను రక్షించడంలో గొప్ప సమన్వయం కనబరిచారు.
4. ములుగు జిల్లాకు చెందిన ప్రసన్న రాణి (ములుగు జిల్లా జిల్లా పరిషత్‌ సీఈఓ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ)
– కొండారు గ్రామంలో వరదల్లో చిక్కుకున్న గర్భిణులను క్షేమంగా తరలించడంతో పాటు, వాయుమార్గం ద్వారా చేపట్టిన ఆహారపంపిణీని జాగ్రత్తగా పర్యవేక్షించారు.
5.భూపాలపల్లి జిల్లాకు చెందిన ఆర్‌.ఎ.ఎస్‌.పి. లత (జిల్లా పంచాయతీ అధికారి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ)
– వరదల్లో చిక్కుకున్న జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రాణనష్టం జరగకుండా రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు
6. భూపాలపల్లి జిల్లాకు చెందిన బి.ప్రదీప్‌ కుమార్‌ (ఆర్‌ఐ, రెవెన్యూశాఖ)
– వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షిచేందుకు బోట్లు, హెలికాప్టర్‌ సేవలను సమర్థంగా వినియోగించి 100 మందికి పైగా ప్రజలను రక్షించి, వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
7.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వి. వెంకటేశ్వర్లు (అడిషనల్‌ కలెక్టర్‌, రెవెన్యూ శాఖ)
– వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి, రక్షణ, పునరావాస చర్యలు చేపట్టారు.
8.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ముత్యాల రావు (మండల పంచాయతీ అధికారి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ)
– వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించారు. వారికి రక్షణ, పునరావాస చర్యలు చేపట్టారు.
9. భూపాలపల్లి జిల్లా (వరంగల్‌ కమిషనరేట్‌)కు చెందిన రామనరసింహా రెడ్డి (సీఐ, పోలీస్‌ శాఖ)
– వరదల్లో చిక్కుకున్న ప్రజలను తరలింపు, తప్పిపోయిన నలుగురు వ్యక్తులను రక్షించడంతో పాటు, మరో మూడు మృతదేహాలను గుర్తించారు
10. భూపాలపల్లి జిల్లా (వరంగల్‌ కమిషనరేట్‌ )కు చెందిన వి.నరేష్‌ (కొయ్యూరు ఎస్‌ఐ, పోలీస్‌ శాఖ) – మానేరు నది వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు.
11.వరంగల్‌ జిల్లాకు చెందిన కె. సంపత్‌ (ఏఎస్‌ఐ, మట్వాడ పీఎస్‌, పోలీసు శాఖ)
– తన టీమ్‌తో వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 880 మంది ప్రజలను రక్షించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
12.ములుగు జిల్లాకు చెందిన జి. రాంబాబు (ఏఎస్‌ఐ, పోలీస్‌ శాఖ)
– మేడారంలో వరదల్లో చిక్కుకున్న 19 మందిని తన టీమ్‌తో పాటు రక్షించారు.
13.ములుగుజిల్లాకు చెందిన కె. శ్రీకాంత్‌ (కానిస్టేబుల్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ స్పెషల్‌ పార్టీ)
– తన టీమ్‌తో కలిసి మేడారం వరదల్లో చిక్కుకున్న 19 మందిని రక్షించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
14.హైదరాబాద్‌ కు చెందిన ఏడిగ చిట్టిబాబు (అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఎన్‌ఆర్‌ఐ సెక్షన్‌, జీఏడీ) – ఉక్రెయిన్‌, సూడాన్‌ దేశాల్లో యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వరాష్ట్రానికి తరలించడంలో చురుకైన పాత్రను పోషించారు. 2014 నుంచి నేటి వరకు వేర్వేరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ ప్రాంతానికి చెందిన 1200 మంది వ్యక్తుల మృతదేహాలను తెలంగాణకు తరలించడంలో ఆయా దేశాల ఎంబసీలు, కాన్సులేట్‌ అధికారులు, హైకమిషనర్లతో సమన్వయం, సంప్రదింపులు జరిపి, వారి వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించడంలో గొప్ప పాత్రను పోషించారు.

Spread the love