దళిత మహిళపై సామూహిక లైంగికదాడి

తుగ్గలి- దళిత మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పొలం పనులకు వెళ్లిన సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జరిగిన ఈ సంఘటన బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎద్దుల దొడ్డి గ్రామానికి చెందిన దళిత మహిళ అదే గ్రామానికి చెందిన ఈడిగ ఉపేంద్ర పొలంలో ఆముదపు పంటను కోసేందుకు ఈ నెల ఐదున వెళ్లారు. పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో కాపు కాచిన ఈడిగ ఉపేంద్ర, రామానాయుడు కలిసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించారు. ఈ ఘటనపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుగ్గలి ఎస్‌పి మల్లికార్జున తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి : ఎంఆర్‌పిఎస్‌
దళిత మహిళపై లైంగికదాడి చేసిన సంఘటనలో నిందితులైన ఈడిగ ఉపేంద్ర, రామనాయుడును కఠినంగా శిక్షించాలని ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఉసిరిపాట బ్రహ్మయ్య, జిల్లా కన్వీనర్‌ రామకొండ వెంకటేశ్వర్లు, కో కన్వీనర్‌ పులికొండ డిమాండ్‌ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఎంఆర్‌పిఎస్‌ నాయకులు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, దాడులు అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.

Spread the love