Friday, May 22, 2026
E-PAPER
Homeక్రైమ్అశ్వారావుపేటలో భారీగా గంజాయి పట్టివేత 

అశ్వారావుపేటలో భారీగా గంజాయి పట్టివేత 

- Advertisement -

– రూ.1.50 కోట్ల విలువైన 300 కిలోలు స్వాధీనం
– రాజస్థాన్‌కు చెందిన నలుగురు నిందితులు అరెస్ట్
– వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో రూ.1.50 కోట్ల విలువైన 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముఠాకు చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్సీ రోహిత్ రాజు శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారి రోహిత్ రాజు ఆదేశాలు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనల మేరకు మే 21 న అశ్వారావుపేట ఆర్టుఓ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజస్థాన్ రిజిస్ట్రేషన్ RJ 06 CD 9546 మారుతి బాలెనో కారు, RJ 51 GA 0464 టాటా లారీని ఆపి తనిఖీ చేయగా భారీగా గంజాయి బయటపడింది.

బాలెనో కారులో 10 కిలోల చొప్పున 5 ప్యాకెట్లు, టాటా లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య చాంబర్‌లో 10 కిలోల చొప్పున 25 ప్యాకెట్లు గుర్తించారు. మొత్తం 30 ప్యాకెట్లలో ఉన్న 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన నిందితులు:
రాజేష్ పూరి – రాజస్థాన్ (కారు డ్రైవర్/ట్రాన్స్‌పోర్టర్)
షహజాద్ ఖాన్ – రాజస్థాన్ (లారీ డ్రైవర్/ట్రాన్స్‌పోర్టర్)
కమలేశ్ శర్మ – రాజస్థాన్ (ట్రాన్స్‌పోర్టర్)
రమేష్ చంద్ర బలై – రాజస్థాన్ (ట్రాన్స్‌పోర్టర్)
విచారణలో నిందితులు ఆంధ్ర – ఒడిశా సరిహద్దులోని “ముంచింగిపుట్టు” అటవీ ప్రాంతంలో సరఫరాదారుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.  అనంతరం దానిని రాజస్థాన్‌కు తరలించి అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.

ఈ కేసులో పోలీసులు రెండు వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు, 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్సీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన అశ్వారావుపేట పోలీస్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ బృందాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్,అశ్వారావుపేట, దమ్మపేట ఎస్సై లు యయాతి రాజు,రాషేష్ కుమార్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -