Friday, May 22, 2026
E-PAPER
Homeకరీంనగర్ధాన్యం తరలింపులో జాప్యం..రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యం..రోడ్డెక్కిన రైతులు

- Advertisement -

-మూడు గంటల పాటు బైఠాయింపు
-కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్
నవతెలంగాణ-రాయికల్

ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు రోజుల తరబడి అలాగే పేరుకుపోతుండగా, తరలింపు లేక రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల భయం వెంటాడుతుండగా, మరోవైపు లారీలు, కూలీల కొరత రైతుల కష్టాలను మరింత పెంచుతోంది. “ప్రతి గింజ కొనుగోలు చేస్తాం”అని ప్రభుత్వం చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల కన్నీటి గాధ ఆగడం లేదు.

గత పది రోజులుగా తూకం వేసిన ధాన్య బస్తాలను తరలించడం లేదని, వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. రాయికల్-జగిత్యాల ప్రధాన రహదారిపై ఉప్పుమడుగు వద్ద ఆలూరు, రాజనగర్, వీరాపూర్ గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు రోజుల తరబడి అలాగే ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. ఒక్కో బస్తాను లారీలో లోడ్ చేయాలంటే నాలుగు నుంచి ఐదు రూపాయలు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. డబ్బులు తీసుకుంటే తప్ప కూలీలు బస్తాలు తరలించడం లేదని, ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా స్పందించడం లేదని మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాల్లోనే బస్తాలు నిల్వ ఉండడంతో వెయిట్ లాస్ అవుతోందని రైతులు తెలిపారు. ఇప్పటికే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే జిల్లా కలెక్టర్‌, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు కంటతడి పెడితే రాజ్యం ఎలా ఉంటుందంటూ ప్రశ్నించారు. రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి దాపురించిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమన్నారు. లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. మరో పది రోజుల్లో వర్షాకాలం పంటల సాగు ప్రారంభమయ్యే సమయం వస్తోందని, అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే తరలించాలని కోరారు. ఒకవైపు ప్రభుత్వం“ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..రైతులకు ఇబ్బందులు ఉండవు” అంటూ ప్రకటనలు చేస్తోందని,కానీ క్షేత్రస్థాయిలో రైతులు కంటతడి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల ఆందోళనతో సమాచారం అందుకున్న ఎస్సై సి.హెచ్ సుధీర్ రావు,ఆర్.ఐ పద్మయ్య అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -