ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

Huge encounter in Chhattisgarh– బీజాపూర్‌ అడవుల్లో ఎదురుకాల్పులు
– మహిళతో సహా పదిమంది మావోయిస్టులు మృతి
నవతెలంగాణ-చర్ల
బీజాపూర్‌ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని లెండ్రా గ్రామం అడవిలో ఉదయం 06:00 గంటల నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది. డీఆర్జీ ఎస్టీఎఫ్‌ కోబ్రా, సీఆర్పీఎఫ్‌ ఆధ్వర్యంలో బీజాపూర్‌లోని గంగలూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరపగా, ఆత్మరక్షణ కోసం పోలీసులూ కాల్పులు జరిపారు. అనంతరం సంఘటనా స్థలంలో ఒక మహిళా మావోయిస్టుతో సహా మొత్తం 10 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హతమైన మావోయిస్టుల్లో ఎక్కువ మంది పీఎల్‌జీఏ కంపెనీ రెండో నెంబర్‌కు చెందిన వారిని పోలీసులు ధ్రువీకరించారు. వారిలో ఇద్దరు.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు ఘటనల్లో నిందితురాలుగా ఉండి రూ.29 లక్షలు రివార్డ్‌ గల డీవీసీఎం సజంతి అలియాస్‌ క్రాంతి, 14 లక్షల రివార్డుతో మావోయిస్టు రఘు అలియాస్‌ షేర్‌ సింగ్‌ ఏసీఎంగా గుర్తించారు. అలాగే ఘటనాస్థలంలో ఒక ఎల్‌ఎంజీ ఆటోమేటిక్‌ ఆయుధం, 303 రైఫిల్‌, 12 బోర్‌ రైఫిల్స్‌, పెద్ద మొత్తంలో బీజీఎల్‌ సెల్ఫ్‌, లాంచర్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రోజువారీ ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్‌ వెల్లడించారు. బస్తర్‌ ప్రాంతంలోని బీజపూర్‌లో మావోయిస్టుల కార్యకలాపాలు అధికంగా ఉంటాయి. ఈ ఏడాది బస్తర్‌ ప్రాంతంలో ఇప్పటి వరకూ జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 41 మంది మావోయిస్టులు హతమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా ఎన్‌కౌంటర్‌ జరిగింది. బస్తర్‌ లోక్‌సభ స్థానానికి ఈ నెల 19న తొలి దశలోనే పోలింగ్‌ జరగనుంది. గత నెల నుండే మావోయిస్టులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. సాధారణంగా మార్చి-జూన్‌ మధ్యకాలంలో భద్రతాదళాలపై ఎక్కువ దాడులు జరుగుతుంటాయి. గత నెలలో బీజపూర్‌లోని బసగుడా ప్రాంతంలో భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.

 

Spread the love