హైదరాబాద్‌ ‘షాన్‌’ నుమాయిష్‌ షురూ

Hyderabad 'Shaan' Numaish Shuroo– తొలిసారి ఎగ్జిబిషన్‌లో శాఖాహారం రెస్టారెంట్‌
– ముఖ్యమంత్రి చేతులమీదుగా జనవరి 1 నుంచి ప్రారంభం
– అవసరమైతే ఫ్రీగా మాస్క్‌లు అందిస్తాం : మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నుమాయిష్‌ సందడి వచ్చేసింది. జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 83వ అఖిల భారత పారిశ్రామిక (నుమాయిష్‌-2024) ప్రదర్శన ప్రారంభం కానున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 83వసంతాల అఖిలభారత ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలోని గాంధీ సెంటనరీ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎగ్జిబిషన్‌ కార్యదర్శి బి. హనుమంతరావు, ఉపాధ్యక్షులు వి. సత్యేందం, సంయుక్త కార్యదర్శి చంద్రజీత్‌ సింగ్‌, కోశాధికారి ఈ. రాజేందర్‌ కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు ఐకాన్‌గా నిలిచిన నుమాయిష్‌కు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వ్యాపారులు, సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఒక వేదికగా నుమాయిష్‌ నిలిచిందన్నారు. పరిశ్రమలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 1వ ఎగ్జిబిషన్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో 1938లో పారిశ్రామిక ప్రదర్శనలను ప్రారంభించారని, ప్రతి సంవత్సరం మెరుగుపడుతూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుం దన్నారు. ప్రస్తుత ప్రదర్శనలో సుమారు 2400స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, తొలిసారి శాఖాహారం రెస్టారెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రూ.40లు టికెట్‌ ధరగా నిర్ణయించారని, ఐదేండ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. 45 రోజులపాటు కొనసాగే నుమాయిష్‌లో సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెట్రో, ఆర్టీసీ బస్సులను అదనపు ట్రిప్‌లు నడిపించాలని సంబంధిత శాఖలకు సూచించామన్నారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే మెట్రోకు టికెట్‌ తీసుకునేలా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నుమాయిష్‌ నుంచి వచ్చే ఆదాయంతో తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న 20 విద్యా సంస్థలకు స్పాన్సర్‌ చేస్తున్నామని, దాంతో 2వేలకుపైగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రతీ సంవత్సరం సుమారు 30,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవసరమైతే మాస్క్‌లను ఉచితంగా అందిస్తామన్నారు. వృద్దులు, నడవ లేని వారికి ఎగ్జిబిషన్‌ లోపల ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వాహనాలతో సందర్శించే అవకాశం కల్పిస్తామన్నారు. నుమాయిష్‌ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నుమాయిష్‌ అడ్వజైర్‌ టివి గోపాలచారి, కన్వీనర్‌ జివి రంగారెడ్డి, పీఆర్వో రవి యాదవ్‌తోపాటు కమిటీ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు.

Spread the love