అభివృద్ధికి ఆమడ దూరంలో.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కాలనీలు

– సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి సీహెచ్ ఎల్లేష్ 
– వార్డుల్లో సీపీఐఎం ఇంటింటి సర్వే
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి 
ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి సీహెచ్ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ లోని పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలపై సీపీఐఎం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ లో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గాంధీనగర్ కాలనీలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లేని పేదలు చాలామంది ఉన్నారన్నారు. గాంధీనగర్ మహంకాళి కాలనీలో సీసీ రోడ్లు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు మంజూరు కోసం ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారన్నారు. అర్హులైన వారందరికీ   ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. బీజేఅర్ కాలనీలో పేదలు కూడా ఇవే సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని భూమిలేని పేదలందరికీ వర్తింపజేయాలన్నారు. ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ ఉపాధిహామీ పనిని వెంటనే కల్పించాలన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామని ప్రభుత్వ అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారని ఇవ్వడం లేదన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. వీటన్నిటినీ పరిష్కరించకపోతే త్వరలోనే మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిటీ సభ్యులు ఏర్పుల వీరేశం, చీమల ముసలయ్య, పార్టీ సభ్యులు హనుమంత శివ, మల్లెల నర్సింహ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love