అక్కడ ఎండాకాలం వస్తే..

If summer comes there..– ప్రాజెక్టుకు కేటాయించిన భూములు సాగుకు.. పరిహారం ఇచ్చిన భూములు లీజుకు !
– ప్రభుత్వానికిచ్చిన నిర్వాసితుల భూములను కబ్జా చేసి కౌలుకు ఇస్తున్న పెద్దలు
– శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌ ముంపు భూముల్లో వింత పరిస్థితి
– చిన చేపను పెద్ద చేప తినేసినట్టు..
ఎండాకాలం వస్తే చాలు..శ్రీశైలం ప్రాజెక్టుపై కన్నెయటానికి పెద్దలు రెడీ అయిపోతారు. వలసపక్షుల్లా ..ఎక్కడెక్కడ నుంచో అక్కడికి (గద్దల్లా )వాలిపోతారు. ఈ భూములు మావంటూ చెప్పి.. కౌలుకిచ్చేసి..క్యాష్‌ చేసుకుని పోవటం ఆనవాయితీగా మారింది. ఈ యవ్వారం అధికారులకు తెలిసినా.. అమ్యామ్యాలకు అలవాటుపడి చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిది
40 ఏండ్ల క్రితం శ్రీశైలం ప్రాజెక్టుకు రైతులు భూములు అప్పగించారు. ప్రాజెక్టు ముంపులో భూములు కోల్పోయిన వారికి అప్పట్లో ఆనాటి ప్రభుత్వం కొంతమేరకు పరిహారం అందించింది. ఇందులో సన్న, చిన్న, మధ్యతరగతి రైతులూ ఉన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు రిజర్వాయర్‌లో వేసవికాలం రాగానే వేలాది ఎకరాల్లో నీళ్లు ఉండవు. మామూలుగానే చదునుచేసినట్టు ఉంటుంది. ఈ భూములపై కొంతమంది కన్నుపడింది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఆ భూములు మావని చెప్పి ప్రాజెక్టుకు కేటాయించిన భూములను కబ్జా చేసుకొని స్థానికులకు కౌలుకు ఇచ్చి లక్షలు వసూలు చేస్తుండటం గమనార్హం. ఇదంతా వేసవికాలంలో బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు పోతున్నారు. ఈ వ్యవహారం మరింత ఎక్కువ కావడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక్‌ సాల్‌ పట్టా కింద శ్రీశైలం ముంపు భూములపై పేదలకు హక్కులు కల్పించాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 1986కు ముందే శ్రీశైలం రిజర్వాయరు ఏర్పాటు కోసం లక్షా 25 వేల ఎకరాలను అప్పటి ప్రభుత్వం సేకరించింది. 50 వేల కుటుంబాలు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి నగరాలకు వలసపోయాయి. ఈ రిజర్వాయరుతో ఒక అలంపూర్‌లోనే 60 గ్రామాలు నీట మునిగాయి. కొల్లాపూర్‌, వనపర్తి, పెబ్బేర్‌ మండలాల పరిధిలో సుమారు 18 గ్రామాలు నీట మునిగాయి. ముంపులో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అరకొర పరిహారాన్ని మాత్రమే అందించింది. శ్రీశైలం నిండుగా ఉన్నప్పుడు ప్రాజెక్టుకు ఇచ్చిన భూములు మునిగిపోతాయి. ఎండాకాలంలో అయితే రిజర్వాయరు ఖాళీ అయ్యి భూములు తేలతాయి. ఈ సమయంలో భూముల్లో వేరుశనగ, మక్క, ధనియాలు, కుసుమలు, ఆవాలతో పాటు కూరగాయలు, ఆరుతడి పంటలు సాగు చేసుకునే అవకాశాన్ని అప్పటి అధికారులు కల్పించినట్టు తెలిసింది. ఇక్కడి భూములను వదిలిపెట్టిన భూస్వాములు కొందరు.. ఇది గమనించి వారు స్థిరపడిన హైదరాబాద్‌ నుంచి వచ్చి తేలిన భూములు మావంటూ కబ్జా చేసుకున్నారు. వీరికీ సాగు భూములకు సంబంధం లేకున్నా.. కబ్జాలకు పాల్పడుస్త్రతన్న వీరిని అడిగేవారు లేకుండాపోయారు. ఆ భూములను కబ్జాదారులు దర్జాగా స్థానికరైతులకు
కౌలుకు ఇస్తూ రూలక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
అధికారులకు తెలియకుండానే సాగునా..?
లక్షా 25 వేల ఎకరాల్లో 25 వేల ఎకరాలు సాగుకు యోగ్యం కాని గుట్టలు, కాల్వలు లాంటి భూములున్నాయి. ఇందులో 15 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా, మిగతా భూములను రైతుల నుంచి సేకరించారు. ఆయా భూములను ప్రభుత్వ రికార్డులోకి ఎక్కించారు. ధరణి ప్రకారం ఈ భూముల.. పట్టాల మార్పిడికి గాని, అక్రమంగా సాగు చేయడానికి గాని వీలుకాదు. కానీ ే కృష్ణా పరివాహక ప్రాంతంలో జరుగుతున్నది ఇదే. ఇందులో సుమారు 15 వేల మంది 50 వేల ఎకరాల్లో గతంలో పట్టాలు ఉన్నవారు ఉన్నారు. మిగతా భూములు ఇతరుల కబ్జాలో ఉన్నాయి. కొంత మంది హైదరాబాద్‌లో ఉండి ఇక్కడి భూములను కబ్జా చేసుకున్నారు. దాంతో సన్న, చిన్న కారు రైతులు కౌలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా..
అధికారులకు తెలియకపోవడం విడ్డూరం. శ్రీశైలంతో పాటు అనేక రిజర్వాయర్లలో సైతం సాగు భూములు ముంపునకు గురయ్యాయి. పాలమూరు- రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో సుమారు 50 వేల ఎకరాలకు పైగా సాగు భూములు మునిగిపోయాయి. కొన్ని రిజర్వాయర్లలో ఇంకా నీటిని నింప లేదు. ఇక్కడ సైతం రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. రిజర్వాయర్ల కోసం తవ్విన కాల్వలు, సర్వీసు రోడ్లల్లో సైతం కొందరు అక్రమంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగచేసుకొని కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, నిజమైన లబ్దిదారులకే సాగుకు అవకాశం ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
మా భూములకే మేము కౌలు ఇచ్చుకునే దుస్థితి
– శ్రీశైలం, రైతు, సోమశీల, కొల్లాపూర్‌ మండలం

శ్రీశైలం రిజర్వాయరులో సర్వం కోల్పోయాం. ఇల్లు, భూములు నీట మునిగాయి. వేసవిలో తేలిన భూములు తమవేనని చెప్పి నేటికీ కౌలుకు ఇస్తున్నారు. మా భూములను సాగు చేసుకోవడానికి మాకే పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
పేదలకు పట్టాలు ఇవ్వాలి.
ఎండీ జబ్బార్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, వనపర్తి
శ్రీశైలం రిజర్వాయరులో అనేక మంది పేదల భూములు కోల్పోయారు. అయితే కొంత మంది భూస్వాములు మునిగిన భూములు తమవేనని నేటికీ కౌలుకు ఇవ్వడం విచిత్రంగా ఉంది. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంగంపల్లి గ్రామానికి వచ్చి వాస్తవంగా పంటలు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రతి రైతుకు పట్టాలు ఇవ్వాలి.

Spread the love