ఏపీ సీఎం జగన్‌పై దాడి

Attack on AP CM Jagan– విజయవాడలో రాయి విసిరిన అగంతకులు
– కనుబొమ్మపై గాయం
– మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి
– వెలంపల్లికి కూడా గాయం
విజయవాడ : విజయవాడలో శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నిర్వహిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహనరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. విజయవాడ సింగ్‌నగర్‌ డాబాకొట్లు సెంటరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ప్రజలకు జగన్‌ అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి పూలతోపాటు విసిరిన రాయి అత్యంత వేగంగా వచ్చి ఆయన కనుబొమ్మ పైభాగంలో తాకింది. దీంతో, సీఎంకు గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపు యాత్రను నిలుపుదల చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సీఎంను టాప్‌పై నుంచి బస్సులోకి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం సీఎం జగన్‌ బస్సులోనే కూర్చొని యాత్రను కేశరపల్లి వరకు కొనసాగించారు. అయితే వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి (జిజిహెచ్‌)కు వెళ్లి ఆయన చికిత్స అందుకున్నారు. ముఖ్యమంత్రి భార్య వైఎస్‌ భారతి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కాగా దాడి సమయంలో ముఖ్యమంత్రి సీఎం పక్కనే ఉన్న వైసిపి సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు, అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా రాయి తగిలి గాయమైంది. రోడ్‌ షోకు వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకే టీడీపీ వారు దాడికి పాల్పడ్డారని వెలంపల్లి ఆరోపించారు.
త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోడీ
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.
స్టాలిన్‌, చంద్రబాబు ఖండన
జగన్‌పై దాడిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తదితరులు ఖండించారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. రాజకీయాలు ఎప్పుడూ హింసాత్మంగా మారకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.
సమగ్ర విచారణ జరిపించాలి : సీపీఐ(ఎం)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై రాయి విసిరిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఘటన దురదృష్టకరం: షర్మిల
జగన్‌పై జరిగిన దాడి బాధాకరం, దురదృష్టకరమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు.

Spread the love