వడ్డించేవారు మనవారైతే…

– వైద్యారోగ్యశాఖలో డిప్యూటేషన్లు రద్దైనా అక్కడే..!
– జాబితా పంపే క్రమంలో అధికారుల మాయాజాలం
– ఉన్నతాధికారులను పక్కదోవ పట్టించేలా లిస్టు
– ఏండ్ల తరబడి స్థానచలనం లేకపోవడంపై అనుమానాలు
– ప్రభుత్వం మోమో జారీ చేసినా
అంతేనా? వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల వర్క్‌ఆర్డర్లు, డిప్యూటేషన్లు రద్దు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా ఆరు రోజుల కిందట మెమో జారీ చేశారు. ఈ పరిణామం ఆ శాఖ ఉద్యోగులను ఆందోళనకు గురిచేసింది. అయినా కొందరు మాత్రం ఉన్నచోటనే తిష్ట వేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇతర ప్రభుత్వ శాఖల కంటే వైద్య ఆరోగ్యశాఖలోనే డిప్యూటేషన్లపై అత్యధికంగా వైద్యులు, నర్సులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వరకు డీపీహెచ్‌గా పనిచేసిన డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తమ పరిధిలోని వైద్యులు, ఉద్యోగులకు వారు కోరిన విధంగా డిప్యూటేషన్లు, వర్క్‌ ఆర్డర్లు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి.
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / ఖమ్మం
డీపీహెచ్‌, డీఎంఈలను ఆ పోస్టుల నుంచి బదిలీ చేసిన వెంటనే ప్రభుత్వం డిప్యూటేషన్లు రద్దు చేసింది. పాత అధికారుల వద్ద పనిచేసిన సిబ్బంది కొందరు రూ.లక్షలు తీసుకుని డిప్యూటేషన్లు, వర్క్‌ఆర్డర్లు ఇప్పించారనే అనుమానాలున్నాయి. తిరిగి ఆ ఉద్యోగుల చేతుల్లోకే జిల్లా అధికారులు పంపించిన బదిలీల జాబితాలు వెళ్లడంతో వారు ‘వడ్డించేవారు మనవారైతే…’ అనే రీతిలో అసలు విషయాలను కప్పి పెట్టి అధికారులు పంపిన జాబితాలనే ఫైనల్‌ చేసినట్టు తెలుస్తోంది.
ముఖం చూసి వడ్డన
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కొన్ని సంవత్సరాలుగా స్థాన చలనం లేకుండా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్‌ గడువు ముగిసినా తిరిగి ఆర్డర్స్‌ తెచ్చుకుని పొడిగించుకుంటూ వస్తున్నారు. వీరిలో చాలా మంది పిల్లల చదువులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత అనారోగ్యం, దంపతులు ఇద్దరు ఉద్యోగులై ఉండటాన్ని కారణంగా చూపుతున్నారు. అటువంటి వారి డిప్యూటేషన్లు కాకుండా అందరివీ ఏకపక్షంగా రద్దు చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. పైపెచ్చు అటువంటి వారు అధికారులను మేనేజ్‌ చేసి ఇప్పుడు కూడా ఉన్నచోటే విధులు నిర్వహించేలా.. వ్యూహాత్మకంగా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. పిల్లల పరీక్షల సమయంలో డిప్యూటేషన్లు రద్దు చేయడం వీరికో సాకుగా మారిందనే చర్చ జరుగుతోంది.
డిప్యూటేషన్లు రద్దైనా ఉన్నచోటే..!
గత ప్రభుత్వ హయాంలో అధికారులను మేనేజ్‌ చేసి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ నుంచి నచ్చిన చోటికి డిప్యూటేషన్లు వేయించుకున్న కొందరు అధికారుల పేర్లు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటేషన్ల రద్దు జాబితాలో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు అధికారులు, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, ఇద్దరు సివిల్‌ సర్జన్స్‌ డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నా వారిని డిప్యూటేషన్‌ రద్దు జాబితాలో చేర్చలేదు. ఒకరి ఒరిజనల్‌ పోస్టు నల్లగొండ అయితే ఖమ్మంలోనే డిప్యూటేషన్‌పై ఉంటున్నారు. ఇక్కడ డీఎల్‌వోగా పని చేస్తున్నారు. మరొకరిది సివిల్‌ సర్జన్‌గా ఖమ్మం ఒరిజనల్‌ పోస్టు కాగా, డిప్యూటేషన్‌పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారిగా పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రి నుంచి లిస్టు తయారీ విషయంలో అనేక అనుమానాలున్నాయి. ఏ అధికారి పోస్టు ఏక్కడ..? డిప్యూటేషన్‌పై ఎక్కడ ఉన్నారు..? అనే విషయాలను స్పష్టంగా పేర్కొనలేదని తెలుస్తోంది. అధికారులను వివరణ కోరినా సమాధానం లేదు. దీనిపై పలువురు ఉద్యోగులు అధికారుల వైఖరిని తప్పుపడుతున్నారు.
కొందరి పేర్లు డిప్యూటేషన్‌ రద్దు జాబితాలో…!
ప్రమోషన్‌పై బదిలీ అయిన కొందరి పేర్లు డిప్యూటేషన్‌ రద్దు జాబితాలో ఉండటంపై అనుమానాలున్నాయి. నర్సింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఓ నర్స్‌ ప్రమోషన్‌పై తిరుమలాయపాలెం వెళ్తే ఆమెను కూడా డిప్యూటేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారని సమాచారం. ఫ్యామిలీ ప్లానింగ్‌ యూనిట్లో పనిచేసే మరో నర్స్‌ ప్రమోషన్‌పై కొత్తగూడెం బదిలీ అయితే ఆమె కూడా డిప్యూటేషన్‌లో ఉన్నట్టు అధికారులు జాబితాలో సూచించారు. ఇంకో నర్స్‌ ఒరిజనల్‌ పోస్టు ఆదిలాబాద్‌ రిమ్స్‌ కాగా, ఆమె డిప్యూటేషన్‌ మహబూబాబాద్‌కు ఇచ్చారు. ఈ రెండుచోట్ల కాకుండా ఆమె ఏడాది కాలంగా ఖమ్మంలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. డిప్యూటేషన్‌ రద్దు కావడంతో ఇప్పుడు ఆమె ఆదిలాబాద్‌ వెళ్లారు. ఇలా అధికారులు డిప్యూటేషన్‌ రద్దు జాబితాలో గందరగోళం సృష్టించి.. పై అధికారులను సైతం తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తోంది.

Spread the love