మీరు పట్టించుకోకపోతే కోర్టుకెళతాం…

– ‘దానం’ వ్యవహారంపై స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తమ పార్టీ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి… స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఈనెల 18న తాము వినతిపత్రం సమర్పిస్తే… ఇప్పటి వరకూ స్పీకర్‌ చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, బండారి లక్ష్మారెడ్డితో కలిసి కౌశిక్‌ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. దానంపై స్పీకర్‌ సత్వరమే నిర్ణయం తీసుకుంటే దేశం మొత్తం హర్షిస్తుందని అన్నారు. అందువల్ల తామిచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తాము న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సీనియర్‌ నేత కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love