ఓలా బైక్ ట్యాక్సీ నడిపితే నెలకు రూ.70వేల ఆదాయం

నవతెలంగాణ – హైదరాబాద్: వినడానికి ఆశ్చర్యంగా ఉందా..? క్యాబ్ సేవల్లో ఊబర్, ఓలా రెండు దిగ్గజ సంస్థలుగా ఉండడం తెలిసిందే. బైక్ ట్యాక్సీ సేవల్లో ర్యాపిడో టాప్ లో ఉంది. దీంతో బైక్ ట్యాక్సీ సేవల్లోనూ దిగ్గజ సంస్థగా ఎదగాలన్న ప్రయత్నంలో ఓలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సంస్థ గత నెలలో బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలు ఆరంభించింది. బైక్ ట్యాక్సీ సేవలు అందించేందుకు వీలుగా, ఎక్కువ మంది డ్రైవర్లను ఆకర్షించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఒక్కొక్కరు నెలకు రూ.70వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉందని ఓలా అభయం ఇస్తోంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అన్ బోర్డింగ్ సెంటర్ వద్ద ఇందుకు సంబంధించి పెద్ద బ్రోచర్ ను ప్రదర్శించడం కనిపించింది. రైడర్లు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ తో ట్యాక్సీ సేవలు అందించొచ్చని ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. బైక్ ట్యాక్సీ సేవలు అందించేందుకు ఆసక్తితో ముందుకు వచ్చే యువతకు రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్ చేసుకుని, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను అద్దెకు ఇస్తోంది. మొదటి ఐదు కిలోమీటర్లకు గాను ఓలా బైక్ ట్యాక్సీ కస్టమర్ల నుంచి రూ.25 చార్జీ వసూలు చేస్తోంది. మొదటి పది కిలోమీటర్లకు ఈ చార్జీ రూ.50గా ఉంటుందని గత నెలలో సేవల ప్రారంభం సందర్భంగా భవీష్ అగర్వాల్ ప్రకటించారు. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Spread the love