– బీఆర్‌ఎస్ నేతలకు గౌరీ సతీష్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీపై మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హేళనగా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ విమర్శించారు. ఓ అబద్దాన్ని వందసార్లు చెబితే అది నిజమవుతుందా? అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో హర్షవర్ధన్‌రెడ్డి, రియాజ్, సంధ్యారెడ్డి, నిజముద్దీన్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ నాయకులకు రాజకీయ బిక్ష పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మరోసారి మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక పాలనను రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. అధికార ప్రతినిధి భవానీ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కనీసం వార్డ్ మెంబర్ కాని హరీశ్‌రావును కాంగ్రెస్ మంత్రిని చేసిందని తెలిపారు. కాళేశ్వరం పిల్లర్స్ కుంగిన విషయంపై చర్చ జరుగుతుంటే, దాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.