– ఆ పార్టీ అధికారంలోకి వస్తే పరిశ్రమల పర్మిషన్ కోసం ఢిల్లీకెళ్లాల్సిందే : పారిశ్రామికవేత్తలతో భేటీలో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిశ్రమల అనుమతి కోసం ఢిల్లీకి వెళ్లాలి…. వారిని ఒప్పించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలే అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఇండిస్టియలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో కేటీఆర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలుగా కాకుండా పౌరులుగా బీఆర్‌ఎస్‌కు మద్ధతివ్వాలని కోరారు. తెలంగాణ వారికి పరిపాలన రాదనీ, అంధకారం అలుముకుంటుందనీ, భూముల విలువ పడిపోతుందని నాడు ఎన్నో విమర్శలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణకు ముందు విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండేదనీ, ప్రస్తుతం 10 నిమిషాలు కరెంట్ పోతే తట్టుకోలేక పోతున్నామని తెలిపారు.
కర్నాటక డిప్యూటీ సీఎం డీ.కె.శివకుమార్ ఆ రాష్ట్రంలో ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నట్టు చెబితే వచ్చిన వారంతా నవ్వుకున్నారని తెలిపారు. 2014కు ముందు నగర శివారుల్లో 14 రోజులకు ఒక్కసారి మాత్రమే నీటి సరఫరా ఉండేదనీ, ప్రస్తుతం ప్రతిరోజూ సరఫరా ఉందని తెలిపారు. 24 గంటల పాటు నీటి సరఫరా చేయాలనేది తమ ఆలోచన అని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం ఉన్నందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి పరిశ్రమలు ఇక్కడికి తరలివస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్థిరంగా లేకపోతే ముందుగా దెబ్బతినేవి పరిశ్రమలేనని చెప్పారు. అవినీతి లేకుండా తమ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించిందని కేటీఆర్ తెలిపారు.