తక్షణమే కాల్పుల విరమణ ఐరాస తీర్మానం

Instantly ceasefire UN resolution– అనుకూలంగా ఓటేసిన భారత్‌
– మారుతున్న ప్రపంచ దేశాల వైఖరి
గాజా స్ట్రిప్‌ : మానవతా దృష్టితో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. సుమారు రెండు నెలల క్రితం ఇదే రకమైన తీర్మానంపై ఐరాసలో ఓటింగ్‌ జరిగినప్పుడు గైర్హాజరు అయిన భారత్‌, ఈసారి మద్దతుగా ఓటేయడం విశేషం. తీర్మానానికి అనుకూలంగా 153 సభ్య దేశాలు ఓటు వేశాయి. అంటే ఐరాస సభ్య దేశాలలో సుమారు 80% దేశాలు తక్షణ కాల్పుల విరమణకు మద్దతు తెలిపాయి. తీర్మానాన్ని 10 దేశాలు వ్యతిరేకించగా 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. పౌరుల ప్రాణాలు కాపాడేందుకు, చట్టపరమైన, మానవతావాద కర్తవ్యాలను నెరవేర్చేందుకు కాల్పుల విరమణ పాటించాలని తీర్మానం కోరింది. ఆక్రమిత తూర్పు జెరుసలేం లోనూ, మిగిలిన పాలస్తీనా ఆక్రమిత భూభాగంలోనూ ఇజ్రాయిల్‌ సాగిస్తున్న అక్రమ చర్యలపై చర్చించేందుకు ఐరాస 10వ అత్యవసర సమావేశం న్యూ యార్క్‌లో జరిగింది. అక్టోబర్‌లో ఐరాసలో ఇదే విధమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా జరిగిన ఓటింగ్‌కు భారత్‌ సహా 45 దేశాలు గైర్హాజరు అయ్యాయి. అప్పుడు తీర్మానానికి అనుకూలంగా 120 ఓట్లు, వ్యతిరేకంగా 14 ఓట్లు వచ్చాయి. తాజా ఓటింగ్‌లో తీర్మానాన్ని వ్యతిరేకించిన దేశాల సంఖ్య 10కి తగ్గింది. అమెరికా, ఆస్ట్రియా, సెచియా, లైబేరియా, పసిఫిక్‌ భాగస్వామ్య దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. ఓటింగ్‌కు దూరంగా ఉన్న దేశాల సంఖ్య కూడా 45 నుండి 23కి తగ్గడం గమనార్హం. తీర్మానాన్ని అరబ్‌ గ్రూప్‌, ఇస్లామిక్‌ సహకార సంస్థ ప్రవేశపెట్టాయి. ఉక్రెయిన్‌పై దురాక్రమణను ఖండించిన దేశాల కంటే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దేశాల సంఖ్యే ఎక్కువగా ఉంది. తీర్మానంలో ఆస్ట్రియా, అమెరికా దేశాలు రెండు సవరణలు ప్రతిపాదించాయి. అయితే మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు లభించకపోవడంతో వాటిని తీర్మానంలో చేర్చలేదు. గాజాలో మానవతావాద విపత్తు సంభవించిందని తీర్మానం తెలిపింది. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించింది. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి పాలస్తీనా, ఇజ్రాయిల్‌ పౌరులను కాపాడాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది. బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని, మానవతావాద సాయానికి అవకాశం ఇవ్వాలని తీర్మానం డిమాండ్‌ చేసింది.
గత తీర్మానం సందర్భంగా గైర్హాజరు అయిన 21 దేశాలు ఈసారి తీర్మానాన్ని సమర్ధించాయి. వాటిలో సగం యూరోపియన్‌ యూనియన్‌ దేశాలే. గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమంటే అమెరికాకు కీలక భాగస్వాములుగా ఉన్న కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. ఆసియా దేశాలలో ఫిలిప్పీన్స్‌ కూడా తీర్మానాన్ని సమర్ధించింది. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంపై భారత్‌ వివరణ ఇస్తూ అక్టోబర్‌ 7న జరిగిన ఉగ్ర దాడిని ప్రస్తావించింది. అయితే ఈసారి కూడా హమాస్‌పై స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా గాజాలో మరణించిన వారి సంఖ్య 18 వేలకు చేరింది.

Spread the love