స్థలాభావం పేరిట దిగుమతి ఆలస్యం..

– కొనుగోళ్లపై ప్రభావం ఇబ్బందుల్లో రైతన్నలు
నవ తెలంగాణ – సిద్దిపేట
ఆరుకాలం కష్టపడి పండించిన పంట చేతికి అందాలన్నా , వచ్చిన ధాన్యం అమ్ముకోవాలన్న, అమ్మిన ధాన్యం రైస్ మిల్లులకు చేర్చాలన్న , మిల్లుకు చేరిన ధాన్యం అన్ లోడింగ్ కావాలన్న ప్రతి అంశంలో రైతన్నకు తిప్పలు తప్పడం లేదు.  మొగిపురుగు, వడగండ్ల వాన, అకాల వర్షాలకు వడ్లు నేలరాలి రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అన్ని కష్టాలు తీరే మిగిలిన పంటను ప్రభుత్వానికి అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలలో జాప్యం జరుగుతున్నది. ఎండిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి బార్ధాన్ రాక, అమ్మిన ధాన్యాన్ని తీసుకెళ్ళే లారీలు లేక రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి. చివరికి ధాన్యం మిల్లుకు చేరినప్పటికీ అక్కడ స్థలాభావంతో వాహనాలలోనే బస్తాలు ఉండటంతో రైతులు మిల్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాలలో ఉన్నప్పుడు వర్షం కురిస్తే… బస్తాలు తడిస్తే… ఆ నష్టం రైతుకే అంటగడతారు మిల్లర్లు. దీంతో మిల్లుకు చేరిన ధాన్యం మిల్లులో దిగేంతవరకు రైతులు బాధలు వర్ణనాతీతం. జిల్లా లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో యాసంగి సీజన్ లో వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3,31,000 ఎకరాలల్లో రైతులు వరిసాగు చేశారు. 7,97,219 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి ఉంటుందని అధికారుల అంచనా వేయగా, 6 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఐకెపి అధ్వర్యంలో 219, పీ ఎ సీ ఎస్ అధ్వర్యంలో 192, మెప్మ అధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు , మొత్తంగా 416 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారుగా 2లక్షల 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుండి సేకరించినట్లు పౌరసరుఫరాల శాఖ అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత యాసంగి (2021-22) లో 3,92,452 మెట్రిక్ టన్నుల వరిధాన్యం రైతుల వద్ద నుండి ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత అనుభవాల ప్రకారం ఈ సీజన్ లో మరో లక్ష మెట్రిక్ టన్నుల వరిధాన్యం రైతుల నుండి కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా.
దిగుమతిలో ఆలస్యం రైతులకు శాపం..
జిల్లా వ్యాప్తంగా 49 బాయిల్డ్, 96 రా రైస్ మిల్లులు ఉన్నాయి. ఆయా రైస్ మిల్లుల్లో గత సీజన్లకు సంబంధించిన ధాన్యంతో నిండిపోయాయని, తాజాగా వచ్చిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి స్థలం లేదన్న కారణంతో మిల్లర్లు దిగుమతికి ఆలస్యం చేస్తున్నారు. దీంతో కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో అన్నదాత కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జిల్లా పౌరసరుఫరాల శాఖ అధికారులు మంగళవారం రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
అధికారుల అలసత్వమే పరిస్థితికి కారణమా..
గత సీజన్ల కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం, ప్రస్తుత పరిస్థితి కారణమా అంటే అవుననే సమాధానం వ్యక్తం అవుతుంది. అధికారుల అలసత్వం మూలంగానే మిల్లర్లు తమ మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే బియంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో రైస్ మిల్లులో ధాన్యం పేరుకుపోయింది. దీంతో ఇప్పుడు వచ్చిన ధాన్యం దించుకోవడానికి స్థలాభావం మూలంగా వాహనాల నుండి ధాన్యాన్ని దించకుండా ఉంచడంతో, కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొందని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకాలం సాగుకు పొలాలను సిద్దం చేసుకోవాల్సిన రైతులు నేటికి కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులలో స్థలం లేకుంటే గోదాములలో రైస్ మిల్లు పేరిట నిలువ చేయాలని, రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

Spread the love