‘నిందితుడిని నిరవధిక కాలం ఖైదు చేయడం

– ప్రాధమిక హక్కుల ఉల్లంఘనే !’
ముంబయి : విచారణ పూర్తయ్యేవరకు ఒక వ్యక్తిని నిరవధికంగా ఖైదీ చేయరాదని, అది, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జంట హత్యల కేసులో నిందితుడైన ఒక వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పూనే జిల్లాలోని లోనావాలా పోలీసులు 2016 సెప్టెంబరులో అరెస్టు చేసిన ఆకాష్‌ సతీస్‌ చండాలియాకు ఈ నెల 26న ఏకసభ్య ధర్మాసనం జస్టిస్‌ భారతి డాంగ్రే బెయిల్‌ మంజూరు చేశారు. ఆరోపణల తీవ్రతకు, విచారణ ముగియడానికి పట్టే సుదీర్ఘ కాలానికి మధ్య సమతూకం వుండాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. నేరం యొక్క తీవ్రత, దాని హేయమైన స్వభావం ఒక కోణం, దాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. అయితే అదే సమయంలో బెయిల్‌పై నిందితుడిని విడుదల చేసే విచక్షణను కూడా గమనంలోకి తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడిని సుదీర్ఘకాలం ఖైదుగా వుంచడమనే అంశాన్ని కూడా కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుందని పేర్కొంది. నిర్దిష్ట కాలపరిమితిలో విచారణను పూర్తి చేయడానికి ఆదేశాలు జారీ అయినప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడం లేదని, అందువల్ల బెయిల్‌పై నిందితుడిని విడుదల చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Spread the love