జమ్మూకాశ్మీర్‌లో

– రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం..
శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాంబన్‌ జిల్లాలో ఓ వాహనంలో తరలిస్తున్న 30 కిలోల కొకైన్‌ను పట్టుకున్నట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఆదివారం తెలిపారు. అతిపెద్ద డ్రగ్స్‌ రవాణాలో ఒకదానిని రికవరీ చేయడంతో పాటు ఇద్దరు పంజాబ్‌ వ్యక్తులను అరెస్టు చేసినట్టు జమ్మూ జోన్‌ ఏడీజీపీ ముకేశ్‌ సింగ్‌ వెల్లడించారు. అరెస్టయిన స్మగ్లర్లు జలంధర్‌కు చెందిన సరబ్‌జీత్‌ సింగ్‌, ఫగ్వారాకు చెందిన హనీ బస్రాగా గుర్తించినట్టు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిలోని బనిహాల్‌ వద్ద శనివారం రాత్రి 10.30గంటల సమయంలో ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా.. అందులో భారీగా డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించారు. ఇది చాలా హైగ్రేడ్‌ కొకైన్‌ అని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.300 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Spread the love