– సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాల(సేమ్ సెక్స్ మ్యారేజ్)ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వాటికి సంబంధించిన పిటిషన్లను కొట్టివేయాలని కోరింది. ఇది దేశ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని పేర్కొంది. భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377ను డిక్రిమినలైజ్ చేయడం వల్ల స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వాలని కోరకూడదని తెలిపింది. సహజంగా విజాతీయుల మధ్య జరిగే వివాహానికే గుర్తింపు ఉంటుందనీ, చరిత్ర మొత్తం చూసినా ఇదే ప్రమాణం కనిపిస్తుందని పేర్కొంది. రాజ్యం మనుగడకు ఇది పునాది అని వివరించింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. విజాతీయుల మధ్య పెళ్లికి ఉన్న సామాజిక విలువలను పరిగణనలోకి తీసుకుని, విజాతీయుల మధ్య జరిగే వివాహాలకు మాత్రమే గుర్తింపునివ్వడం రాజ్యానికి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. సమాజంలోని వ్యక్తుల మధ్య సంబంధాల విషయంలో వ్యక్తిగత అవగాహనలు రకరకాలుగా ఉండవచ్చుననీ, పెళ్లిళ్లు, కలయికలు వంటివి వేర్వేరు రూపాల్లో ఉండవచ్చుననీ, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హెటిరోసెక్సువల్ (స్త్రీ, పురుషుల మధ్య) వివాహానికి మాత్రమే గుర్తింపును పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. పెళ్లిళ్లు, కలయికలు వంటివి వేర్వేరు రూపాల్లో ఉన్నవాటికి గుర్తింపు ఇవ్వకపోయినప్పటికీ చట్టవ్యతిరేకం కాదని తెలిపింది. సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉందనీ, దీనిలో చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయనీ, సమాజం అనే భవన నిర్మాణానికి ఇవి ఇటుకల వంటివని తెలిపింది. కుటుంబాలు కొనసాగాలని తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపబోతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు కాజ్ లిస్ట్ వెల్లడించింది.